Lorry Accident: అనంతపురం జిల్లాకు చెందిన కొందరు ప్రజలు పెన్నా నదిలో ప్రవహిస్తున్న నీటిని చూసేందుకని వెళ్లారు. అక్కడే ఉన్న కాలువపల్లి బ్రిడ్జిపై తిరుగతూ హాయిగా గడుపుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతలోనే వారి సంతోషాలను ఆవిరి చేసేందుకే అన్నట్లుగా ఓ లారీ దూసుకొచ్చింది. ముందు మనుషులు ఉన్నారనే విషయం కూడా గుర్తించకుండా ఓ డ్రైవర్ ఇద్దరు మహిళల పైనుంచే లారీని తీసుకెళ్లాడు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారిని చూసేందుకు కూడా భయమేసేంత దారుణంగా శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి.


పేడూరు డ్యాం నాలుగు గేట్లు తెరవడంతో...


అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద ఉన్న పేడూరు డ్యాం నాలుగు గేట్లను తెరిచారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ఎక్కువవడంతో.. అప్రమత్తమైన అధికారులు గేట్లు ఓపెన్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. నీటి ఉద్ధృతిని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రోజూ చాలా మంది వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది పెన్నా నది వద్దకు వెళ్లారు. బ్రిడ్జిపై నిల్చొని ఆనందంగా గడుపుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఫొటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు.


నుజ్జునుజ్జుగా మారిన ఇద్దరు మహిళలు..


బ్రిడ్జిపై నిల్చుని నీటి ప్రవహిస్తున్న నీటి అందాలను వీక్షిస్తున్న వారి వైపు ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. సరస్వతి, లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళల పైనుంచే లారీని తీసుకెళ్లాడు ఆ డ్రైవర్. ఈ క్రమంలో ఆ మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ మాంసపు ముద్దలను చూసిన గ్రామస్థులు గజగజా వణికిపోయారు. కుటుంబ సభ్యులు అయితే కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. అందంగా ముస్తాబై ఆటవిడుపు కోసం అలా వెళ్లిన మహిళలు.. అంతలోనే మాంసపు ముద్దలుగా మారడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 


వెంటపడి మరీ లారీ డ్రైవర్ ను పట్టుకున్న గ్రామస్థులు..


ప్రమాదం జరగగానే గ్రామస్థులంతా లారీ వెంటపడి మరీ డ్రైవర్ ను పట్టుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళలు ఒకేసారి ఇంత దారుణంగా మృతి చెందడంతో కాలువపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.