Chain Snatchings In Tadepalli In Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లిలో (Tadepalli) చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 5 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన సరస్వతి కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ దాడిలో గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అటు, కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మరో మహిళ మెడలోనూ అదే బైక్‌పై వచ్చిన దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది. ఈ ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. హైసెక్యూరిటీ ఉండే కుంచనపల్లి, కొత్తూరు ప్రాంతాల్లోనే ఈ చోరీలు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.