Why is it important to be vegetarian | సద్గురు: మనం తినే ఆహారం మన ఆలోచనలపై, విలువలు మరియు నైతికతలపై ఆధారపడి ఉండకూడదు, అది మన శరీరం ఏమి కోరుకుంటుందో దానిపై ఆధారపడి ఉండాలి. ఆహారం అనేది శరీరానికి సంబంధించినది. ఆహార విషయానికొస్తే, డాక్టర్లను లేదా పోషకాహార నిపుణులను అడగకండి, ఎందుకంటే వీళ్ళు ప్రతి ఐదేళ్లకు తమ అభిప్రాయాలను మారుస్తూ ఉంటారు. ఆహార విషయానికొస్తే, ఏ రకమైన ఆహారం తింటే శరీరం నిజంగా సంతోషంగా ఉంటుందో దానినే అడగండి. వివిధ రకాల ఆహారాలను ప్రయత్నించి, ఆహారం తిన్న తర్వాత మీ శరీరానికి ఎలా అనిపిస్తుందో గమనించండి. మీ శరీరం చురుగ్గా, ఉత్సాహంగా ఇంకా హాయిగా ఉంటే, దానర్థం శరీరం సంతోషంగా ఉందని. శరీరం మందకొడిగా ఉంటూ, చురుగ్గా ఉండటానికి కెఫీన్ లేదా నికోటిన్‌తో ఉత్తేజపరచాల్సి వస్తుంటే, దానర్థం శరీరం సంతోషంగా లేదని, అంతే కదా?


మీరు మీ మనసు చెప్పేది వింటున్నారు


మీరు వినటానికి సిద్ధంగా ఉంటే, ఏ రకమైన ఆహారంతో అది సంతోషంగా ఉంటుందో మీ శరీరం మీకు స్పష్టంగా చెబుతుంది. కానీ ప్రస్తుతం, మీరు మీ మనసు చెప్పేది వింటున్నారు. మీ మనసు ఎల్లప్పుడూ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. ఇది గతంలో మిమ్మల్ని మోసం చేయలేదా? ఈ రోజు అది మీకు ‘ఇదే సరైన ఆహారం’ అని చెబుతుంది. మరుసటి రోజున, మునుపటి రోజున దాన్ని నమ్మినందుకు, మీరొక మూర్ఖుడు అనిపించేలా చేస్తుంది. కాబట్టి మీ మనసును నమ్మకండి. కేవలం మీ శరీరాన్ని వినడం నేర్చుకోండి.


మీ శరీరంలోకి ప్రవేశించే ఆహార పదార్థాల నాణ్యత పరంగా చూస్తే, కచ్చితంగా మాంసాహారం కంటే శాకాహారం వ్యవస్థకు చాలా మంచిది. ఇక్కడ మనం దీన్ని నైతిక దృష్టితో చూడటం లేదు. వ్యవస్థకు ఏది అనుకూలంగా ఉంటుంది అని మాత్రమే చూస్తున్నాము - శరీరంలో సౌకర్యంగా అనిపించేలా చేసే ఆహారాలను తినాలని చూస్తున్నాము. ఏ ఆహారంతో అయితే మీ శరీరం ఎక్కువ సౌకర్యంగా ఉంటుందో, అలాగే ఏ ఆహారం నుండైతే పోషణను పొందడానికి శరీరం పాట్లు పడాల్సిన అవసరం ఉండదో, అటువంటి ఆహారాన్నే కదా మనం తినాల్సింది.


శాఖాహారం ఎంతటి మార్పును తీసుకువస్తుందో చూడండి


ఒకసారి ప్రయత్నించి చూడండి, జీవంతో తొణికిసలాడే శాకాహారాన్ని తిన్నప్పుడు, అది ఎంతటి మార్పును తీసుకువస్తుందో చూడండి. అంటే ఇక్కడ ఉద్దేశం, వీలైనంత ఎక్కువగా సజీవమైన ఆహారాన్ని తినాలని - సజీవంగా ఉంటూ మనం తినదగ్గది అయిన ఆహారాన్ని తీసుకోవాలని. ఒక సజీవమైన కణం జీవాన్ని నిలబెట్టడానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటుంది. మనం ఆహారాన్ని వండినప్పుడు, అది దానిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ఇలా నశించిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరానికి మునుపటి స్థాయిలో జీవశక్తి లభించదు. కానీ మీరు సజీవమైన  ఆహారాన్ని తిన్నప్పుడు, అది మీలో వేరే స్థాయి సజీవత్వాన్ని నింపుతుంది. మీరు తీసుకునే ఆహారంలో కనీసం ముప్పై నుంచి నలభై శాతం సజీవమైన ఆహారాన్ని - అంటే సజీవమైన పదార్థాలను తీసుకుంటే, అది మీలోని జీవాన్ని కూడా చాలా గొప్పగా నిలబెట్టడాన్ని మీరే చూస్తారు.


అన్నింటికీ మించి, మనం తినే ఆహారం కూడా జీవమే. మనం ఇతర రూపాల్లో ఉన్న జీవాన్ని తింటున్నాము - ఇతర రూపాల్లో ఉన్న జీవులు,  మన జీవాన్ని నిలబెట్టడానికి వాటి ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాయి. మన జీవాన్ని నిలబెట్టడానికి తమ ప్రాణాన్ని త్యాగం చేసే అన్ని జీవాల పట్ల కృతజ్ఞత భావనతో మనం ఆహారాన్ని తినగలిగితే, ఆ ఆహారం మన శరీరంలో చాలా భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తుంది.


భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన యాభై మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్ను ప్రకటించింది. 400 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైనచైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించుఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.