PDS Rice found in Stella Ship at Kakinada port | కాకినాడ: కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం లోడింగ్ చేసినట్లు గుర్తించిన స్లెల్లా నౌకను సీజ్ చేశారా లేదా అనేది మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. మొదట కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షిప్‌ను సీజ్ చేశారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో అధికారులు మొదట పవన్ కళ్యాణ్ ను షిప్ లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం ఉన్న విదేశీ నౌక స్టెల్లాను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సీజ్ ద షిప్ అని పవన్ చెప్పిన మాట దేశవ్యప్తంగా ట్రెండింగ్ అయింది. కానీ స్టెల్లా షిప్‌ను ఎవరూ సీజ్ చేయలేదు అనేది వాస్తవం. ఆ వివరాలిలా ఉన్నాయి..
640 టన్నులు కాదు అంతకుమించి రేషన్ బియ్యం గుర్తింపు
కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణాపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తాను పరిశీలించిన తరువాత నవంబరు 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశీ నౌక స్టెల్లా ఎల్ పనామా షిప్‌ను పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టింది. యాంకరేజ్ పోర్టులో భారీ ఎత్తున పీడీఎస్ బియ్యంతో దొరికిన స్టెల్లా షిప్‌లో ఉన్న బియ్యంపై ఐదు విభాగాల అధికారులను బృందంగా ఏర్పాటు చేశారు. అధికారులు దాదాపు 12 గంటల పాటు స్టెల్లా ఓడలోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 వరకు శాంపిల్స్ సేకరించారు. స్టెల్లా షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉండగా, అందులో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం (PDS Rice) ఉన్నట్టు టీమ్ నిర్ధరించింది. 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకున్నాం, కానీ తనిఖీల అనంతరం దానికి రెట్టింపు రేషన్ బియ్యం ఉందని గుర్తించినట్లు చెప్పారు.
బియ్యం అన్‌లోడ్ చేశాకే షిప్ పై నిర్ణయం
కాకినాడ పోర్టులో ప్రస్తుతం లోడ్ చేయాల్సిన బియ్యం 12 వేల టన్నుల వరకు ఉంది. స్టెల్లా ఓడలో గుర్తించిన 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయించి అనంతరం సీజ్ చేస్తాం. రేషన్ బియ్యం అన్ లోడ్ చేసిన తరువాతే షిప్ సీజ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఓడ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తోందని దర్యాప్తులో తేలినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. అయితే ఆ రైస్ ఇండస్ట్రీస్ వారు ఇంత పెద్ద ఎత్తున బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారు తదితర అంశాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పీడీఎస్ బియ్యం లేదు అని అధికారులు నిర్ధారించిన తరువాతే లోడింగ్ అనుమతిస్తాం. డీప్‌సీ వాటర్ పోర్టు, యాంకేజ్ పోర్టులో మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు.
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఒక్క గ్రాము కూడా రాష్ట్రం దాటకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిజాయితీగా బియ్యం వ్యాపారం చేసే వారికి ఏ ఇబ్బంది ఉండదని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అంశంపై 13 సంస్థలపై కేసులు నమోదు చేశామన్నారు. గోదావరి జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా 89 మిల్లుల నుంచి రేషన్ బియ్యం సరఫరా అయినట్లు పేర్కొన్నారు.
Also Read: Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం