BR Ambedkar Konaseema District | బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని నదీపాయల్లో ఇసుక దోపిడీ యధేచ్చగా సాగుతోంది. రాత్రివేళల్లో నదీ గర్భంలో తవ్వకాలు చేపట్టి ఇసుకను బోట్లు ద్వారా తీరానికి చేర్చి ఆపై ట్రాక్టర్, ట్రక్కుల లెక్కన అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలు అందిస్తుండగా గత మూడు నెలలుగా లక్షల క్యూబిక్ మీటర్లు మేర ఇసుక అక్రమంగా తరలిపోతోంది. మండల స్థాయిలో అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగు నదీపాయల్లో ఇదే తంతు..
గోదావరి (Godavari River) నుంచి వశిష్ట, గౌతమి, వైనతేయ, వృద్ధ గౌతమి నదీపాయలుగా విడిపోగా పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట నియోజవర్గాల పరిధిలో ఈఅక్రమ వ్యవహారం జోరుగా సాగుతోంది. అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్న కొందరు బోట్లు ద్వారా నదిలోకి వెళ్లి అక్కడ జట్టు కూలీల ద్వారా బకెట్లతో నదిలోనుంచి ఇసుకను తవ్వి బోట్లులో నింపి ఆపై తీరానికి చేర్చి అక్కడి నుంచి విక్రయాలు జరుపుతున్నారు. వైనతేయ నదిలో బోడసకుర్రు, పాశర్లపూడి ప్రాంతాల్లో వైనతేయ వారధి క్రింద ఈ అనధికార అక్రమ ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు అక్కడికి ఇసుకను బోట్లు ద్వారా చేర్చి ఆపై ట్రాక్టర్లు ద్వారా అమ్ముకుంటున్నారు.
ఇదిలా ఉంటే వశిష్ట నదీపాయకు సంబంధించి రాజోలు మండల పరిధిలో పలు చోట్ల ఈ అక్రమ ఇసుక ర్యాంపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఇక ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలా పరిధిలో పలు అనధికార ర్యాంపులతో ఇసుకను తవ్వేస్తున్నారు. కొత్తపేటలో అధికారిక ర్యాంపులు ఉన్నప్పటికీ ఇంకా పలు చోట్ల అనధికార ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసుకుని ఇసుకను అమ్ముకుంటున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, పాశర్లపూడి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
నదీపాయలకు సంబందించి బ్యాక్ వాటర్ వచ్చే దరిదాపుల్లో నదిలో ఇసుక తవ్వకాలు చేయకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ ప్రవాహం ఉన్నంత పరిధి వరకు నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం ద్వారా సముద్ర జలాలు మరింత ముందుకు వచ్చి ఇసుక తవ్విన చోట భూగర్భ జలాలు పూర్తిగా లవణజలాలుగా మారతాయని ఈకారణం చేతనే ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు. అంతే కాకుండా నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాల్లో కూడా దీని ఎఫెక్ట్ పడి భూగర్భజలాలు అన్నీ ఉప్పుకాసారాలుగా మారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) భావించింది.
గతంలో తలెత్తిన ఈ పరిస్థితులపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్ధేశం చేయడంతో ఈ తరహా తవ్వకాలను నిషేధించారు. ఒకప్పుడు ఈ నదీపాయల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ చేసేవారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనుమతులు నిలిపివేశారు. అయితే నిబంధనలు ఈ విధంగా చెబుతున్నా స్థానికంగా కొందరు రాజకీయ నాయకుల అండదంలతో రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు మాత్రం యధేచ్ఛగా సాగిస్తూ లక్షలు, కోట్లు దోచేస్తున్నారు.