మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడింది సొంత కుటుంబసభ్యులే కావడం గమనార్హం. బాధితురాలి భర్త, అత్త, మామ ఈ దారుణానికి పాల్పడ్డారు. 21 ఏళ్ల బాధితురాలు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో ఆమెను వివస్త్రను చేసి ఊరేగించడమే కాకుండా వీడియో తీశారు. గురువారం ఈఘటన జరగగా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేతలు ఈ ఘటనతో రాష్ట్రంలో పరిస్థితులపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ స్పందించారు. విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.


ధరియావాద్‌ ఎస్‌హెచ్‌ఓ పెషావర్‌ ఖాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆమె భర్త మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించినట్లు చెప్పారు. ఘటన గురువారం జరిగినట్లు వెల్లడించారు. మహిళ అత్త మామలు ఆమెను కిడ్నాప్‌ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) ఉమేష్ మిశ్రా వెల్లడించారు. అక్రమ సంబంధం పెట్టుకోవడంపై కోపంతోనే ఇలా చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ ఉమేష్‌ శుక్రవారం రాత్రి ఏడీజీ(క్రైమ్‌) దినేష్‌ ను ప్రతాప్‌ గఢ్‌కు పంపించారు. నిందితులను పట్టుకోవడానికి మొత్తం ఆరు బృందాలను పంపినట్లు డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ప్రతాప్‌గఢ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అమిత్‌ కుమార్‌ ఘటన జరిగిన గ్రామంలో క్యాంపింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు.


సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఈ ఘటనపై సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌) లో స్పందించారు. ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటనలకు చోటులేదని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేస్తామని పోస్ట్‌ చేశారు. 


మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఓ గర్భిణీ మహిళను వివస్త్రను చేసి ఊరేగిస్తున్న వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అయ్యే దాకా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్‌కు తెలియడం లేదని విమర్శించారు. దయచేసి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దని, రాజస్థాన్‌ పరువు పోతోందని రాజే ప్రజలను కోరారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాలలకు ఈ క్రూరమైన ఘటన మరో ఉదాహరణ అని రాజస్థాన్‌ అసెంబ్లీ డిప్యూటీ లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌ సతీష్‌ పూనియా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.