Toronto Shooting:
ఐదుగురు మృతి..
కెనడాలోని టొరొంటోలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే...కాల్పులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ఫైరింగ్ జరపగా...అతనూ ప్రాణాలు కోల్పోయాడు. "ఈ ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడిపై కాల్పులు జరిపాం. ఆ వ్యక్తి మృతి చెందాడు. మొత్తం ఆరుగురు చనిపోగా...వీరిలో 5గురు సామాన్య పౌరులు"అని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రస్తుతం చికిత్సపొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ...బతికే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది. ఓ బిల్డింగ్ సమీపంలో ఈ కాల్పులు జరగటం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు వారికి సర్ది చెప్పి ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. నిజానికి..టొరంటోలో ఇలాంటి ఘటనలు జరగటం చాలా అరుదు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకుంది ఈ సిటీ. అలాంటిది..ఇక్కడ ఈ స్థాయిలో కాల్పులు జరగడం అందరినీ కలవరానికి గురి చేసింది. క్రమంగా కెనడా కూడా అమెరికాలాగా మారిపోతోందేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్ కల్చర్ పెరుగుతుందేమోనని అనుమానిస్తున్నారు.
అమెరికాలో గన్ కల్చర్..
అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ
ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. గన్ వయలెన్స్ ద్వారా చనిపోతున్న వారిలో 14% మహిళలే ఉంటున్నారు. గతేడాది లెక్కలు చూస్తే..ప్రతి లక్ష మంది అమెరికన్ మహిళలకు ఏడుగురు తుపాకీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఈ సంఖ్య 4గా ఉంది.
Also Read: Ban Halal Meat: ఆ రాష్ట్రంలో హలాల్ మాంసంపై నిషేధం, చట్టం చేయనున్న ప్రభుత్వం!