Merchant Murdered In Tirupati District: తిరుపతి జిల్లాలో (Tirupati District) దారుణం జరిగింది. కేవలం రూ.1500 కోసం ఓ వ్యాపారిని దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలికిరి గ్రామానికి చెందిన మహబూబ్ సాహెబ్, అజ్మతుల్లా స్థానిక ఇందరి ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తోటి వ్యాపారి రుద్ర.. మహబూబ్ సాహెబ్ నుంచి రూ.1,500 అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి చెల్లించే క్రమంలో రుద్ర సరిగ్గా స్పందించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.


ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రుద్ర కుమారుడు తన అనుచరులతో మార్కెట్‌కు వచ్చాడు. అయితే, ఆ సమయంలో మహబూబ్ సాహెబ్ లేకపోవడంతో అక్కడే పని చేస్తోన్న అజ్మతుల్లాపై.. రుద్ర, అతని అనుచరులు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.


బాలుడిపై గొడ్డలితో దాడి


మరోవైపు, నాలుగేళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటపాక మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్, రమ్య దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి వెంకటేశ్ చిన్న కుమారుడు నాగరాజు (4) మట్టి తేవడానికి పొలం వద్దకు వెళ్లాడు.


ఇదే సమయంలో అక్కడ ఉన్న కోటేశ్వరరావు బాలుడిపై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన సోదరిపై కూడా దాడికి యత్నించగా ఆమె చాకచక్యంగా తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు పరారయ్యాడు. కోటేశ్వరరావుకు మతిస్థిమితం సరిగ్గా లేదని.. భార్య కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి