Perni Nani Name included in Ration Rice Missing Case | మచిలీపట్నం: గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. బియ్యం మాయం కావడంపై నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఇదివరకే కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పేర్ని నాని ఏపీ హైకోర్టులోలంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
నిందితులకు 12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
పేర్ని ఫ్యామిలీకి చెందిన గోదాములలో పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయం కావడంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. A2 మానస తేజ, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి 12 రోజులపాటు రిమాండ్ విధించగా మచిలీపట్నం జైలుకు తరలించారు నోలీసులు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధ హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని లేనిపక్షంలో చర్యలు ఉంటాయని కోర్టు ఆదేశాలలో పేర్కొంది.
రేషన్ బియ్యం అవకతవకలపై కూటమి సర్కార్ ఫోకస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దృష్టిసారించిన విషయాలలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, విదేశాలకు ఏపీ నుంచి తరలించడం. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం పలుచోట్ల తనిఖీలు చేసి అక్రమాలను బయటపెట్టారు. గత ఐదేళ్ల మాదిరిగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సైతం రైస్ మిల్లర్లు, గోదాం యజమానులను హెచ్చరించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో స్టెల్లా అనే విదేశీ నౌకలో టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆపేశారు. ఇటీవల ఆ బియ్యాన్ని అన్ లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు.
యాప్ తెచ్చిన వెంటనే పేర్ని ఫ్యామిలీ లేఖ, అధికారుల చర్యలు
గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం సమాచారం తెలిసేందుకు పౌరసరఫరాల శాఖ యాప్ లాంచ్ చేసింది. అందులో వివరాలు ఎలా నమోదు చేయాలో గోదాం యజమానులు, సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. ఆ మరుసటి రోజే తమ గోదాముల్లో బియ్యం కొంత తగ్గిందని, అందుకు లెక్కగట్టి చెబితే డబ్బులు చెల్లిస్తామని పేర్ని జయసుధకు చెందిన గోదాము నుంచి లేఖ వచ్చింది. మొదట గోదాములో 3000 బస్తాలు కనిపించడం లేదనుకున్నారు, చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించారని, అధిక ధరలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారి ఫిర్యాదుతో పేర్ని జయసుధపై కేసు నమోదు చేశారు పోలీసులు.
విచారణకు హాజరు కావాలని పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు సైతం నోటీసులు జారీ చేశారు. ఎవరూ విచారణకు మాత్రం హాజరుకాలేదు. మిస్సింగ్ బియ్యానికి జరిమానాతో కలిపి రూ. కోటి 74 లక్షలకుపైగా చెల్లించారు. కానీ తప్పు చేసి డబ్బులు చెల్లించడం సరిదకాదని పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని అదృశ్యమయ్యారని ప్రచారం జరగగా.. మీడియా ముందుకు వచ్చిన మాజీ మంత్రి తాను ఎక్కడికి పోలేదన్నారు. ఆడవారిపై కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని, రాజకీయంగా కక్ష ఉంటే తనను ఏమైనా చేసుకోవాలన్నారు.