Gudivada Amarnath Politics | విశాఖపట్నం: గుడివాడ అమర్నాథ్.. ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. ప్రత్యర్థుల సోషల్ మీడియాలో ఎక్కువగానే ట్రోలింగ్ కు గురైన రాజకీయ నాయకుడు. అందుకు ఆయన చేసే కామెంట్స్ కూడా ఓ కారణం. చిన్న వయసులోనే మంత్రి అయిన అమర్నాథ్ వైసీపీ (YSRCP)లో కీలక పాత్రనే పోషించారు. అయితే ప్రస్తుతం రాజకీయంగా నియోజకవర్గంలేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ మాజీ మంత్రి.
అనకాపల్లి టూ గాజువాక
2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్ నాథ్‌ను పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన కేబినెట్ లోకి మంత్రిగా గా తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరిశ్రమలు, ఐటి మంత్రిగా కీలక శాఖలే తీసుకున్నా నిర్ణయాల పరంగా అధికారం మొత్తం హై కమాండ్ దగ్గరే పెట్టుకోవడంతో పొగడ్తలు పై వాళ్ళకి ట్రోలింగ్ మాత్రం అమర్ కు అన్నట్టుగా సాగింది ఆయన టర్మ్ మొత్తం. ఆయన అన్న ప్రతి మాటను ముందు వెనక కట్ చేసి ప్రత్యర్థులు ట్రోలింగ్ మెటీరియల్ గా మార్చేస్తే వైసిపి అధినాయకత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఆయనకు దక్కలేదు అన్న ఆరోపణ ఉంది.
2024 ఎన్నికలకు ఆయనను అనకాపల్లి నుంచి మార్చేసి బలవంతంగా గాజువాక నుంచి పోటీ చేయించారు. ఇష్టం లేకపోయినా పార్టీ మాటకు తలొగ్గి గాజువాక నుంచి పోటీ చేసి కూటమి ప్రభంజనం లో ఓడి పోయారు అమర్నాథ్. ఇప్పుడు ఆయన పరిస్థితి అనకాపల్లిలో పోటీ చేయడానికి లేదు ఇటు గాజువాకలో కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు అన్నట్టు తయారయ్యింది
భీమిలిపై అమర్నాథ్ ఫోకస్
2024లో గుడివాడ అమర్నాథ్ భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ అవంతి శ్రీనివాస్ ఉండడంతో అమర్నాథ్‌కు ఆ సీట్ కేటాయించలేదు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో తాత్కాలికం గా ఆ నియోజకవర్గ బాధ్యతలు అమర్నాథ్ చూస్తున్నారు. తన సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉండే భీమిలి పూర్తి బాధ్యతలు తనకు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి తను గెలవడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఉన్నారు. దీనికి పార్టీ హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ పాలన లో ట్రెండింగ్ లో ఉన్న గుడివాడ అమర్ తనకంటూ ఒక స్థిరమైన నియోజకవర్గం లేని రాజకీయ వేత్తగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.