Tirupati News : తిరుమలలో మద్యపాన నిషేధం అమలులో ఉందని తిరుమల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ తిరుమలయ్య తెలిపారు. తిరుమలలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. జీఎన్సీ టోల్ గేట్ వద్ద వైట్ స్విఫ్ట్ కారులో మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. వాహనంలో 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసామన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న తిరుమలకి చెందిన పీఎన్ రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక బాలాజీనగర్ లో ఉంటూ మద్యం బాటిల్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. తిరుమలలో మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించడం ఉందని, మత్తు పదార్థాలు సేవించిన, విక్రయించిన కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
16 మద్యం సీసాలు స్వాధీనం
తిరుమలలో కొత్త దందా!
తిరుమల శ్రీవారి దర్శనానికి కరోనా తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, ఈ తరుణంలో ఆచరణ సాధ్యం కానీ నిర్ణయాలను టీటీడీ తీసుకుని భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తుందని తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమల కొండపై భక్తులకు అవసరం అయ్యే వివిధ రకాల వస్తువులను ఆయన మీడియాకు చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లలు పాల సీసాలు, వాటర్ బాటిల్స్ లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బలవంతంగా అలిపిరి వద్ద లాక్కుంటున్నారని ఆరోపించారు. తిరుమలలో గాజు బాటిల్స్ యాభై రూపాయలకు విక్రయిస్తూ భక్తులను నిలువునా దోచుకుంటున్నారని చెప్పారు. తిరుమలలో నీళ్ల ధర దాదాపుగా ఇతర ప్రాంతాల్లో బియ్యం ధరతో సమానం అయ్యిందని ఆయన వివరించారు. తిరుమలలో ఇద్దరు వైసీపీ నాయకులు నీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉందని, ప్లాస్టిక్ లేని వస్తువులను తిరుమలకు తీసుకుని రావాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానిదే అని ఆయన గుర్తు చేశారు. ఇవి ప్రశ్నిస్తే తమపై కేసులు, నిఘా పెడుతున్నారని, త్వరలో టీటీడీ ఈవోను కలిసి భక్తుల సమస్యపై చర్చించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ కోరారు.