చిత్తూరు జిల్లా రేణిగుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ బ్యారెక్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందరావు ఆదివారం తెల్లవారు జామున తన దగ్గర ఉన్న పిస్టల్‌తో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడిది శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరు అని పోలీసులు తెలిపారు. 


ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళానికి చెందిన హెచ్‌ ఆనందరావు ఇటీవల సెలవులపై ఇంటికి వెళ్లి వచ్చారు. ఆగష్టు 3న ఆయన తిరిగి విధుల్లో చేరారు. అయితే ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో రైల్వే బ్యారెక్ ఆర్మర్‌ గదిలో కూర్చీలో కూర్చుని... తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోనే ఆయన మరణించాడు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆయన విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు తుపాకీ డిపాజిట్‌ చేసేందుకు రాగా కానిస్టేబుల్ ఆత్మహత్య విషయం వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రేణిగుంట సీఐ అంజూ యాదవ్ తెలిపారు. ఘటనా స్థలంలో ఎటువంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పేర్కొన్నారు.


 ఆత్మహత్యల్లో మహిళలకంటే పురుషులే అధికం


మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రవర్తను వైద్య భాషలో పారాసూసైడ్‌ అని పిలుస్తారు. వ్యవహరికంగా సూసైడల్‌ టెండెన్సీ అంటారు. మనిషి తన జీవితాన్ని తనకు తాను అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్‌ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆ ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధులు అని వైద్యులు పిలుస్తారు.


ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు సాధారణ అయ్యాయి. రోజురోజుకు ఆత్మ హత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న లెక్కల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కల్గించే అంశం. ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే, భారతదేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు బలన్మరణానికి పాల్పడుతున్నారు. ఆ లెక్కల్లో యువత ఎక్కువ ఉన్నారు. మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2019 నివేదికల ప్రకారం మన దేశంలో రోజూ సగటున 381 మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. అనుబంధాలు, ఆప్యాయతలు, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. చిన్న చిన్న కుటుంబ సమస్యలను కొందరు పెద్దవిగా భావించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమ, పెళ్లి వంటి అంశాలే కాక, మత్తుమందులకు బానిసలు అవ్వడంతో యువత తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు.