Red Sandalwood Labourers Arrested in Chittoor District: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎర్రచందనం అక్రమ చేసే స్మగ్లర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వడమాలపేట టోల్ ప్లాజా సమీపంలో తమిళనాడు నుంచి ఎర్రచందనం కూలీల వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సినిమా సీన్ ను తలపించేలా ఓ రేంజ్‌లో ఛేజ్ చేసి మరి 44 ఎర్రచందన కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 81 ఎర్రచందనం దుంగలను, రెండు లారీలను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


తిరుపతి - చెన్నై జాతీయ రహదారిలో పోలీసులు నిఘా.. 
తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వడమాల పేట మండలం, టోల్ ఫ్లాజా సమీపంలోని తిరుపతి - చెన్నై జాతీయ రహదారి (Tirupati - Chennai National Highway)లో గల శివ శక్తి దాబా వద్ద మంగళవారం సాయంత్రం భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే మారుతీ సుజుకి స్విఫ్ట్ వాహనాన్ని ఫైలైట్ వాహనంగా ముందు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వచ్చిన TN97-9837 ఐచర్ లారీ, అశోక్ లేలాండ్ TN 52D0988 రావడంతో వాహనాలను వెంబడించారని తెలిపారు. అనుమానం వచ్చిన లారీ డ్రైవర్లు దిశను మర్చి తిరుపతి వైపు వెళ్ళే ప్రయత్నం చేశారని, ముందుగా ఏర్పాటు చేసిన బారీకేడ్స్, రెండు అదనపు పార్టీల సహాయంతో పుష్ప సినిమాను తలపించేల చేసింగ్ చేసి పట్టుకున్నట్లు వివరించారు. 


2 కోట్లు విలువ గల ఎర్ర దుంగలు స్వాధీనం..
ప్రధాన మేస్త్రి అయినా సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నామని, మరో ప్రధాన మేస్త్రి స్వామి నాథన్ ను అదుపులోకి తీసుకోని కింగ్ పిన్స్ ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేసారు. ఈ సినిమాటిక్ ఛేజింగ్ లో ఇద్దరు డ్రైవర్లను, 42 మంది కూలీలతో పాటుగా, 2 కోట్లు విలువ గల 2632.4 కేజీల బరువుగల 81 ఎర్ర చందనం దుంగలను, 11 గొడ్డళ్లు, 32 రంపాలు, అశోక్ లైలాన్ లారీ, స్విఫ్ట్ కారు, ఐచర్ లారీ స్వాధీనం చేసుకున్నామన్నారు. 


ఎర్ర కూలీలను పట్టుకున్న పోలీసులకు అధికారుల రివార్డులు
ఇంత భారీ స్థాయిలో ఎర్ర చందనం కూలీలను పట్టుకొని, దుంగలను స్వాధీన పరుచుకోవడంలో ప్రతిభ కనబరచిన పుత్తూరు SDPO రామరాజు,  భాకరాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ M. తులసిరాం, పుత్తూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్  M. సురేశ్ కుమార్, వడమలపేట పోలీస్ స్టేషన్ SI E. రామాంజనేయులు, నారాయణవనం పోలీస్ స్టేషన్ SI M. పరమేష్ నాయక్, KVB పురం పోలీస్ స్టేషన్ SI P. సునీల్, పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ SI, P. వెంకట మోహన్, తిరుపతి AR 4 వ బెటాలియన్ RSI సుబ్బరాజు లను తిరుపతి ఎస్పీ అభినందించారు. వారికి తగిన రికార్డులు ప్రకటించారు.