తమిళ నటుడు సూర్యకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సూర్య. ఆయన గతేడాది నటించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. తర్వాత దానిపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ‘జై భీమ్’ సీక్వెల్ పై చిత్ర నిర్మాత రాజశేఖర్, దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై భీమ్’ సీక్వెల్ పై అడిగిన ప్రశ్నలకు వారు ఇలా సమాధానం చెప్పారు. ‘‘ప్రముఖ న్యాయవాది జస్టిస్ చంద్రు ఎన్నో కేసులను వాదించారు. అందులో ఓ కేసును తీసుకొని జై భీమ్ ను తెరకెక్కించాం. ఆయన వాదించిన మరిన్ని కేసులతో సీక్వెల్ ను తీయవచ్చు’’ అని సమాధానమిచ్చారు. దీనిబట్టి చూస్తే త్వరలోనే ‘జై భీమ్’ సీక్వెల్ పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రముఖ న్యాయవాది చంద్రు జీవితం ఆధారంగా ‘జై భీమ్’ సినిమా రూపొందించారు. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయిన తన భర్త లాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు అని ఓ మహిళ చేసిన పోరాటానికి న్యాయవాది చంద్రు అండగా ఎలా నిలబడ్డారు అనేదే ‘జైభీమ్’ సినిమా. న్యాయవాది చంద్రు పాత్రలో హీరో సూర్య ఒదిగిపోయారనే చెప్పాలి. అందుకే ఈ సినిమా బెస్ట్ ఫీచర్ పిల్మ్ (విదేశి) ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాలో నిలిచింది. 2022 నవంబర్ లో ఓటీటీ వేదికగా ‘జై భీమ్’ సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఆ సమయంలో కోవిడ్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు. అయితే సినిమాకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై ఉత్కంఠ నెలకొంది. 


ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కమర్షియల్ సినిమాలు కూడా బ్యాలెన్స్ గా చేస్తూ ఉంటాడు. ‘జై భీమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య.. ఆ తర్వాత కమర్షియల్ సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘సూర్య 42’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ‘సూర్య 42’ ను 2డీ, 3డీ ఫార్మాట్ లలో దాదాపు 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్రీన్, యూవీ క్రియేషన్ బ్యానర్లు కలసి నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 



Also Read: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?