Tirupati News : కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడంలేదు. ప్రైవేటు కళాశాల సిబ్బంది ఒత్తిడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తుంది. తాజాగా ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థి మార్కులు తక్కువ వచ్చాయని ఐదో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తిరుపతిలో కలకలం‌ రేపుతుంది. 


తిరుపతిలో విషాదం


తిరుపతి నగరంలోని మంగళం రోడ్డులోని వినాయక సాగర్ సమీపంలో రాధేశ్యాం అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటనారాయణ కుమార్తె కె.సహస్ర (16) ఎంఆర్ పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మానసికంగా కుంగిపోయిందని తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో ప్రైవేటు కళాశాల‌ సిబ్బంది వేధింపులకు తాళలేక శుక్రవారం అర్ధరాత్రి అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సహస్ర తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకున్న తన కుమార్తే ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు పోలీసులు. 


కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు 


బంగారు తల్లి సహస్ర.. లేవమ్మా.. ఎంత పని చేసావు తల్లి..నువ్వు చదువుకోకపోయినా..నువ్వు బతికే దానివి బంగారు... అంటూ సహస్ర తల్లిదండ్రులు కడుపు కోతను తట్టుకోలేక గుండెలను బాధుకుని విలపించారు. ఎన్నో ఆశలతో పెంచుకున్న కుమార్తె కళ్ల ఎదుటే రక్తపు మడుగులో పడి ఉండడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న ఆ తల్లిదండ్రుల బాధను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆవేదన చెందారు. 


కాలేజీ సిబ్బంది వేధింపులే కారణమా?


ప్రైవేట్ విద్యాసంస్థలోని సిబ్బంది ఒత్తిడి కారణంగా విద్యార్థిని ఆత్మహత్య పాల్పడినట్లు విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థుల పట్ల పరుష పదజాలం ఉపయోగించడం కారణంగానే మనోవేదనకు గురై విద్యార్ధినులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అంటున్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలలో సహస్రకు తక్కువ మార్కులు వచ్చాయని గత కొద్ది రోజులుగా కళాశాలలో సిబ్బంది మానసికంగా వేధింపులకు గురి చేయడమే విద్యార్ధికి బలవన్మరణానికి కారణం అయ్యిందని అంటున్నారు. విద్యార్ధిని ఆత్మహత్యతో ప్రైవేటు కళాశాల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.