Revanth Reddy Letter To Governor : తెలంగాణలో వైద్య సీట్ల బ్లాక్ దందాలో మంత్రులు కూడా భాగస్వాములు కావడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మె్ల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మెడికల్ పీజీ సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారన్నారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగులను ఆసరా చేసుకుని ఏటా రూ. వంద కోట్లు మేర సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో సీట్ల కోసం దరఖాస్తు చేయించడం, సీట్ల కేటాయింపు చేయడం కౌన్సిలింగ్ పూర్తైన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇతరులకు రెండు నుంచి రెండున్నర కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు.
సీఎం ఎందుకు స్పందించలేదు?
రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల్లో పీజీ సీట్ల బ్లాక్ దందాపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళి సైకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వారం రోజులుగా పేద, మధ్య తరగతి విద్యార్థులు పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాపై రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. స్థానిక విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయన్నారు. విద్యార్థుల ఆందోళనపై ఇప్పటి వరకు వైద్య శాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ స్పందించలేదన్నారు.
మంత్రులపై ఆరోపణలు!
"కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారే వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి గానీ స్పందిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థు్లే ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఈ అంశంపై పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి. మంత్రుల ఆధీనంలో ఉన్న కళాశాలల్లో బ్లాక్ దందా జరిగినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర భారతదేశానికి చెందిన మెరిట్ విద్యార్థుల పేరుతో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో సీటు కోసం దరఖాస్తు చేయించడం, వారికి సీటు కేటాయింపు జరిగాక కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు చేరకుండా ఉంచి, ఆ తర్వాత అదే సీటును బ్లాక్ లో వేరే వారికి రూ.2 నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది." అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గవర్నర్ విశేష అధికారాలు ఉపయోగించాలి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేద, మధ్య తరగతి మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోన్న ఈ బ్లాక్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గవర్నర్ ను కోరారు. ఇందులో స్వయంగా టీఆర్ఎస్ మంత్రుల ప్రమేయం ఉన్నందున పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల, విచారణతోనో ఇది నిగ్గు తేలదన్నారు. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ను మీరు నివేదిక కోరినంత మాత్రాన సరిపోదన్నారు. గవర్నర్ హోదాలో రాష్ట్రంలోని యూనివర్సిటీల ఛాన్సెలర్ గా గవర్నర్ కు ఉన్న విస్తృత అధికారాలను ప్రయోగించాల్సిన సందర్భం వచ్చిందన్నారు. బ్లాక్ దందాలో మంత్రుల ప్రమేయం ఉన్నందున నిష్పాక్షికతతో కూడిన, అత్యున్నత విచారణ అవసరమన్నారు.