Tirupati Cyber Crime :  సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూ అందిన వరకూ నగదు దోచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు వివిధ రూపాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ ప్రజలు ఏదోక రూపంలో‌ సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా పూర్వ విద్యార్ధులమంటూ తిరుపతికి చెందిన ఓ అధ్యాపకురాలిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి మోసం చేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో చాకచక్యంగా సైబర్ నేరగాళ్ల నుంచి నగదును అధ్యాపకురాలికి తిరిగి అప్పగించారు.  


అసలేం జరిగింది?


సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ రామచంద్రా‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి నగరానికి చెందిన కల్పన అనే మహిళకు ఫిబ్రవరి 23న ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజ్  వచ్చింది. తను మీ పూర్వ విద్యార్థి అని మెసేజ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తరువాత ఫోన్ చేసి నేను మీ స్టూడెంట్ ని మేడం ఇప్పుడు నేను ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్నానని నమ్మించాడు. నాకు ఆర్మీ క్యాంటీన్ అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ ధరకే వస్తాయని, మీకు కావాలంటే నేను మీకు బెంగుళూరు ఆర్మీ క్యాంటీన్ నుంచి అన్ని ఐటమ్స్ చాలా తక్కువ రేట్ కి పంపిస్తానని నమ్మించాడు. ఎయిర్టెల్ మనీ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కి రూ.59,000 వేయించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అధ్యాపకురాలికి టచ్ లో ఉన్న సైబర్ నేరగాడు.. ఆ తర్వాత ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. కొన్ని రోజుల తరువాత ఆర్మీ క్యాంటీన్ నుంచి వస్తువులు రాకపోయే సరికి అతనికి ఫోన్ కాల్ చేస్తుంటే ఎంతకీ సమాధానం లేకపోవడం, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తాను సైబర్ నేరగాళ్ల చేతిలో  మోసపోయానని గ్రహించిన ఆమె, ఆలస్యం చేయకుండా తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


నిందితుడి అకౌంట్ ఫ్రీజ్ చేసి అధికారులు


సైబర్ క్రైమ్ ల్యాబ్ నిపుణులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారికి తెలియపరచి NCRP (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ )నందు నమోదు చేసి, బాధితురాలి అకౌంట్ నుంచి అమౌంట్ మొత్తం ఎయిర్ టెల్ మనీ పేమెంట్స్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిందని గ్రహించి, వెంటనే సైబర్ నేరగాడి అకౌంట్ ను బ్యాంక్ అధికారుల సహాయంతో  ఫ్రీజ్ చేశారు. బాధితురాలు పోగొట్టుకున్న మొత్తాన్ని ఆమె బ్యాంకు అకౌంట్ కు రిఫండ్ చేయించారు. తిరుపతి సైబర్ క్రైమ్ ల్యాబ్ లో ఫిర్యాదు చేసిన బాధితులకు సకాలంలో స్పందించి ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే NCRP ద్వారా రిఫండ్ చేశారు. తిరుపతి జిల్లా ప్రజలు ఏదైనా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగింది అని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ ఆఫీస్ ను లేదా 1930 (Toll Free number) కు ఫిర్యాదు ఇవ్వవలసినదిగా సైబర్ క్రైమ్ ల్యాబ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.