Tirupati Crime : విడాకులు తీసుకున్న పురుషులే ఆమె టార్గెట్. పెళ్లి చేసుకుని ఆస్తులు కాజేయడమే ఆమె పని. పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా విడాకులు తీసుకున్న పురుషుల వివరాలు తెలుసుకుని వారికి వల వేస్తుంది. యాభై నాలుగేళ్ల వయస్సులో నిత్యం బ్యూటీ పార్లర్ కు వెళ్తూ అమాయకులను మాయం చేస్తోంది ఈ కిలాడీ లేడీ. మేకప్ అందాలతో ఇప్పటికే ముగ్గురిని ముగ్గులోకి దించింది ఈ మహిళ. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా ఆవడికు చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో మాయలేడి మాయలు వెలుగులోకి వచ్చాయి.  


అసలేం జరిగింది?  


తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పుదుప్పేటలో ఇంద్రాణి(65) కుమారుడుతో కలిసి నివాసం ఉంటుంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతడికి పెళ్లై విడాకులు తీసుకున్నాడు. కుమారుడికి మళ్లీ పెళ్లి చేసేందుకు గత 6 ఏళ్లుగా ఇంద్రాణి వెతుకుతుంది. ఇదే సమయంలో 2021లో ఏపీలోని తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య ఓ పెళ్లి బ్రోకర్‌ ద్వారా పరిచయమైంది. తనది నిరుపేద కుటుంబమని పరిచయం చేసుకోంది. ఇంద్రాణి కుటుంబం మహిళను చూసేందుకు ఏపీకి వస్తోందని తెలుసుకున్న 54 ఏళ్ల శరణ్య బ్యూటీ పార్లర్‌కు వెళ్లి జుట్టు సరిచేసుకుని మేకప్ వేసుకుని 35 ఏళ్ల వరుడి కుటుంబం ముందు కనిపించింది. శరణ్యను చూసిన వరుడు కుటుంబ సభ్యులు ఆమె నచ్చడంతో తిరువళ్లూరులో వివాహం జరిపించారు. ఇంద్రాణి కుమారుడు తన సొంత ఖర్చుతో పెళ్లి కూతురుకు 25 సవరల‌ బంగారు నగలు ఇచ్చి వివాహం చేసుకున్నాడు. 


ఆస్తులు రాసివ్వాలని 


 పెళ్లైన కొద్ది రోజులకే శరణ్య అత్త ఇంద్రాణి, భర్తతో గొడవకు దిగ్గేది. భర్త నెలవారీ ఆదాయం ఇవ్వాలని, బీరువా తాళం చెవి ఇవ్వాలని తరచూ గొడవ పడేది. భర్త, అత్త పేరు మీద ఉన్న ఆస్తులను తన పేరు మీద రాయాలని భర్తను వేధించేది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇంద్రాణిని శరణ్య ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆస్తులు మార్పులు చేసేందుకు శరణ్యను ఆధార్ కార్డుతో సహా డాక్యుమెంట్లు అడిగాడు భర్త. శరణ్య తన ఆధార్ కార్డుతో సహా డాక్యుమెంట్ ఇచ్చింది. శరణ్య ఇచ్చిన ఆధార్ కార్డులో c/o రవి అని రాసి ఉండడంతో ఇంద్రాణికి, ఆమె కుమారుడుకి అనుమానం వచ్చింది. తల్లి, కుమారుడు శరణ్యకు తెలియకుండా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 


విడాకులు తీసుకున్న యువకులే టార్గెట్ 


పుత్తూరుకు చెందిన శరణ్య అలియాస్ సుకున్య(సంధ్య)కి అదే ప్రాంతానికి చెందిన రవితో ఇంతకు ముందే వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భర్త రవితో విభేదాల కారణంగా సుకన్య విడిపోయింది. భర్త రవి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. భర్త నుంచి విడిపోయిన సుకన్య తన తల్లితో కలిసి జీవిస్తోంది. సుకన్య భర్త రవి నుంచి విడిపోయిన తరువాత ఆర్థికంగా ఇబ్బంది పడేది. దీంతో సుకన్య రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తమ ప్రాంతంలో ఉన్న పెళ్ళిళ్ల బ్రోకర్లతో పరిచయం పెంచుకుని పెళ్ళై విడాకులు తీసుకున్న యువకులను మోసం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంద్రాణి కుమారుడు విడాకులు తీసుకున్నాడని విషయం తెలుసుకున్న సుకన్య చెన్నైకి వెళ్లి ఇంద్రాణి కుమారుడితో శరణ్యగా పరిచయం పెంచుకుంది. తనకు వివాహమైందన్న విషయాన్ని దాచిపెట్టి ఇంద్రాణి కుమారుడిని పెళ్లాడి అతని ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించింది. 


వరకట్నం కేసుతో 


సుకన్య కొంతమంది పెళ్లిళ్ల బ్రోకర్ సహాయంతో జొల్లార్ పేటకు చెందిన రైల్వే ఫుడ్ కాంట్రాక్టర్ సుబ్రమణికి సంధ్యగా పరిచయం చేసుకుని, దాదాపు 11 ఏళ్లుగా భార్యాభర్తలుగా కుటుంబాన్ని నడిపించింది. ఆ తరువాత సేలం జిల్లాలో కొంతకాలంగా సుబ్రమణితో కలిసి ఉంటున్న ఆమె కరోనా కాలంలో తన తల్లిని చూడటానికి వెళ్తున్నానని చెప్పి ఇటీవలె ఇంటికి తిరిగి వచ్చింది. సుకన్య, సంధ్య, శరణ్య ఇలా పలు పేర్లు వాడుకుని విడాకులు తీసుకున్న వాళ్లను మళ్లీ పెళ్లాడి మోసాలకు పాల్పడేది.  భర్త సుబ్రమణి తన భార్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తనకు తెలియదని పోలీసు స్టేషన్ కు వెళ్తే భార్య లీలలు బయటపడ్డాయని అంటున్నారు. అలాగే మోసం చేసిన మహిళ తన మొదటి భర్త రవిపై ఏపీలో వరకట్న కేసు పెట్టి రూ.10 లక్షలు స్వాహా చేసింది. విడాకులు తీసుకున్న వారి నుంచి ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్న కిలాడీ శరణ్యపై  కేసు నమోదు చేసిన  పోలీసులు ఆమెను రిమాండ్ కు తరలించారు..