తిరుపతి జిల్లాలో దొంగలు రెచ్చి పోతున్నారు. వేసవి కాలం వస్తేనే దొంగల బెడదతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఉక్కపోత భరించలేక ఇంటి ముందు, డాబా మీద కుటుంబం మొత్తం నిద్రపోతుంటే ఇంట్లో చొరబడి చోరీలు చేస్తుంటాయి కొన్ని ముఠాలు. ఒంటరిగా వ్యక్తులు ఉన్న ఇళ్ళతో పాటుగా, తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా తాళాలు వేసిన మూడు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు, ఉన్నదంతా దోచుకుని, అక్కడే దర్జాగా స్నానం చేసి మరి సొమ్ముతో ఉడాయించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేటలోని శ్రీశ్రీ నగర్ లో కాపురం ఉంటున్న ఈశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అనంతపురంకు వెళ్లింది.. ఐతే పక్కా సమాచారంతో సోమవారం అర్థరాత్రి ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి చోరబడిన దొంగలు, కబోర్డులో దాచి ఉంచిన నగలు దోచుకున్నారు. అలాగే విజయనగర్ కాలనీకి చెందిన సుమతి తాళాలు వేసుకుని మేడపై నిద్రిస్తుండగా, ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సుమతి ఎదురుగా నివాసం ఉంటున్న మేఘన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లింది. మేఘన ఇంట్లో కూడా చొరబడిన దొంగలు సొమ్ముతో పాటుగా, బంగారు నగలను దోచుకెళ్లారు.
మంగళవారం ఉదయం ఇంటి తాళాలు బద్ధలుకొట్టి ఉండడాన్ని గమనించి, ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఐతే యజమాని ఫిర్యాదుతో సంఘటన స్ధలంకు చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.. ఎంత నగదు, బంగారం చోరీ జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో సంఘటన స్ధలంలో క్లూస్ ని సేకరించారు.. మూడు ఇళ్ళల్లో దొంగతనాలు చేసిన దుండగులు శ్రీశ్రీనగర్ లో నివాసం ఉంటున్న ఈశ్వరి ఇంటి సమీపంలో స్నానం చేసి టవల్, సోప్ అక్కడి వదిలి వెళ్లారు..