Tirupati Crime News :  రాష్ట్రంలో అధికార పార్టీపై ఏదొక మూల ఆరోపణలు గుప్పు మంటూనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వంపై క్రింది స్థాయి నేతల నుంచి మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి వరకూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం, బీరమాకుల కండ్రిగ  గ్రామంలో కన్నమ్మ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరురాలు అధికార పార్టీ నేత వేధింపులు బరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కన్నమ్మ ఇంటి ఆవరణంలో స్థానిక నేత మట్టి నింపి, రాళ్ల కూసాలు పెట్టడంతో ఇద్దరి మధ్య మొదలైన గొడవ మహిళ బలవన్మరణానికి కారణమైందని బంధువులు ఆరోపిస్తున్నారు.  మహిళ‌ ఆత్మహత్యకు కారకుడైన అధికార పార్టీ నేతను అరెస్టు చేయాలని, తమకు న్యాయం జరిగే వరకూ మృతిరాలికి దహన సంస్కారాలు చేసేది లేదంటూ మృతురాలి బంధువులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 


అసలు ఏం జరిగిందంటే? 


మృతురాలు కన్నమ్మ బంధువుల కథనం మేరకు... తిరుపతి జిల్లా భీరమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన కన్నమ్మ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.  అయితే కన్నమ్మ టీడీపీ సానుభూతిపరురాలు కావడంతో స్థానిక అధికార పార్టీ నేతలతో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇరవై రోజుల క్రితం స్థానిక అధికార పార్టీకి చెందిన నేత మునికృష్ణా రెడ్డి కన్నమ్మ ఇంటికి వెళ్లే దారిని  మట్టితో నింపి రాతి కూసాలు నాటి కన్నమ్మకు ఇంటి‌ నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకుండా చేశాడు. అయితే విషయం తెలుసుకున్న కన్నమ్మ బంధువులు మునికృష్ణారెడ్డితో వాగ్వాదానికి దిగ్గారు. దీంతో ఆగ్రహించిన మునికృష్ణారెడ్డి గత వారం కన్నమ్మ ఇంటి వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా దూషించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కన్నమ్మ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మునికృష్ణారెడ్డి వ్యక్తిగతంగా దూషించి కారణంగానే అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడిందని కన్నమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయంపై సోమవారం సాయంత్రం పోలీసులకు మృతురాలి‌ బంధువులు ఫిర్యాదు చేసినా అర్ధరాత్రి వరకూ పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు కన్నమ్మకు దహన సంస్కారాలు చేయకుండా ఇంటి వద్దనే మృతదేహంతో ఆందోళన చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కన్నమ్మ ఇంటి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం తమకు అప్పగించాలని కోరారు. పోలీసులు తమకు న్యాయం చేయరని, జిల్లా అధికార యంత్రాంగం  స్పందించి తమకు న్యాయం చేసేంత వరకు దహనక్రియలు చేయబోమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


స్థానిక నేతను అరెస్టు చేసి, తమకు న్యాయ చేసే వరకు ఆందోళన విరమించమని కన్నమ్మ బంధువులు అంటున్నారు. ఇంటికి వెళ్లే దారి లేకుండా చేసి, తిరిగి ఆమెపై దూషణలకు దిగిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని పోలీసులు ప్రశ్నించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లే అర్ధరాత్రి వరకూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మృతదేహంతో ఆందోళనతో దిగితే గానీ పోలీసులు గ్రామానికి రాలేదని అంటున్నారు. అధికార పార్టీ నేతలకు ఒకలా, సామాన్యులకు ఒకలా పోలీసులు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.