Crime News: పలాస-కాశీబుగ్గలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపైముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్ డే పార్టీకి పిలిచి మైనర్‌పై యువకులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పరువు పోతుందని భయపడి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదు. తర్వాత ధైర్యం తెచ్చుకుని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


బర్త్‌డే పార్టీలో అఘాయిత్యం


కాశీబుగ్గకు చెందిన ముగ్గురు బాలికలు, నేతాజీనగర్, సూదికొండ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు ఫ్రెండ్స్‌. కోసంగిపురం జగనన్న కాలనీ వద్ద ఈ నెల 19న శనివారం రాత్రి పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో యువకులు మద్యం సేవించారు. తర్వాత ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడగా వేరొక బాలిక ప్రతిఘటించినట్లుగా తెలిసింది. 


ఫిర్యాదు చేయడానికి తటపటాయించీ...


అత్యాచారానికి పాల్పడుతుండగా యువకులు తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న బాలికలు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకి విషయాన్ని చెప్పారు. అత్యాచారం జరిగిన విషయం బయటకి తెలిస్తే కుటుంబ పరువుపోతుందని ఆలోచించిన బాధిత కుటుంబ సభ్యులు తొలుత ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. 


స్థానికులు ధైర్యం చెప్పడంతో ఫిర్యాదు


ఈ నోటా ఆ నోటా విషయాన్ని తెలుసుకున్న ఐసిడిఎస్, చెల్డ్ లైన్ అధికారులు వాళ్ల ఇంటికి వెళ్లి విచారించగా అలాంటిదేమీ లేదని బుకాయించారు. అధికారులు వచ్చి ఆరా తీస్తున్నారని గ్రహించిన యువకులు స్థానిక పెద్ద మనుషుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేశారు. పోలీసులు కూడా ఘటనపై ఆరా తీశారు. అందరూ ధైర్యం చెప్పడంతో  బాధిత కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసులకి ఫిర్యాదు చేశారు. 


పోలీసులతో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటున్న ఎమ్మెల్యే శిరీష్ 


బాలికలపై అత్యాచార సమాచారం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా తక్షణం స్పందించారు. స్టేషన్‌ సిఐ మోహన్‌రావు, జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో శిరీష మాట్లాడారు. అత్యాచార బాధితులకు చట్టం పరిధిలో న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన ఎంతగానో బాధించిందన్నారు. కారకులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి మత్తులో యువకులు వికృత చేష్టలకి పాల్పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినా సెటిల్‌మెంట్లు చేశారని ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేదన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామన్నారు. ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తెప్పవని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శిరీష.


అందుకే ఫిర్యాదు చేయలేదంటున్న బాధిత కుటుంబం


శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉండేదని ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే భయమేస్తోందని కొందరు తల్లిదండ్రులు అంటున్నారు. ఇలాంటి అరాచకాలు ఎన్నో జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఘటనలు రిపీట్ అవుతున్నాయన్నారు. కఠిన శిక్షలు పడటం లేదన్న కారణంతోనే తాము కూడా బయటకు రాకూడదని అనుకున్నామన్నారు బాధిత కుటుంబం. 


Also Read: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన