Kadapa Accident: కడప జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్క రోడ్డు ప్రమాదం మూడు కుంటుంబాలను రోడ్డున పడేసింది. చేతికి అంది వచ్చిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.
కడప శివావురలోని స్పిరిట్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు బైకుల్లో వెళ్తున్న నలుగురు యువకులు.. ఒకరికొకరు ఎదురుగా వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారి కోసం అంబులెన్స్ లకు ఫోన్ చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులను కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో యువకుడు కూడా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే యువకుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబాలకు సమాచారం అందించారు పోలీసులు. అయితే ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వారిలో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇటీవలే పల్నాడులో ముగ్గురు కూలీల మృతి..
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో వెళ్తోన్న లారీ బోల్తా పడి ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. జిల్లాలోని నకరికల్లు మండలం శాంతి నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాపరాళ్లతో వెళ్తున్న లారీ శాంతినగర్ వద్ద బోల్తా పడింది. లారీలో ఉన్న నాపరాళ్లు కూలీలపై పడడంతో ముగ్గురు మృతి చెందారు. మాచర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు నాపరాళ్లు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కూలీల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కూలీలు మాచర్లలోని పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నో కష్టాలు అనుభవించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. బిడ్డ పెళ్లి చూడకుండానే మృత్యువు కబలించింది. అనుకోని ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో శనివారం జరిగింది. పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై ఓ వంతెన వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. విశాఖ కొమ్మాదిలో ఉంటున్న బగాది షణ్ముఖరావు, విజయలక్ష్మి కుమారుడు సంతోష్‌తో కలిసి గార మండలం వత్సవలసలో రాజమ్మతల్లి ఆలయానికి మొక్కు చెల్లించుకోడానికి శనివారం ఉదయం బయలుదేరారు. మొక్కు తీర్చుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షణ్ముఖరావు, విజయలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సంతోష్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో సంతోష్ తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రుల వద్ద రోదించడం స్థానికులను కలచివేసింది. ఈ ప్రమాదం జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.