Kidnapar Hemanth :   విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య , కుమారుడితో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలోనూ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కిడ్నాప్ చేసి..  డబ్బులు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. భీమిలికి చెందిన రామకృష్ణ అనే టీడీపీ నేతలు ఇలాగే కిడ్నాప్ చేసి.. రూ. కోటి డిమాండ్ చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకేసులో  జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలాగే విజయారెడ్డి అనే మాజీ మహిళా కార్పొరేటర్ హత్య కేసులోనూ హేమంత్ నిందితుడిగా ఉన్నారు. 


అంతకు మించి..అసలు హేమంత్.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనుచరుడిగా చాలా కాలం ఆయన వెంటే  తిరిగారని వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాకుండా.. సినిమాలు నిర్మిస్తూంటారు. ఎంవీవీ సినిమాలు నిర్మిస్తున్న సమయంలో ...  హేమంత్ ఆయన చుట్టూనే ఉండేవారని చెబుతున్నారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత కూడా చాలా కాలంగా ఆయన వెంటే ఉన్నారని.. తర్వాత .. ఎంపీ పేరు చెప్పి దందాలు చేస్తున్నారని దూరం పెట్టినట్లుా చెబుతున్నారు. ఈ కారణంగానే ఎంపీ కుటుంబసభ్యులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయని.. అందుకే సులువుగా కిడ్నాప్ చేయగలిగారని అంటున్నారు. 


హేమంత్ కిడ్నాప్‌లకు ఓ మహిళ సహకరిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళను ఎరగా వేయడం .. ట్రాప్ చేసి కిడ్నాపులు చేయడం చేస్తూంటారని భావిస్తున్నారు. కిడ్నాపులతో వచ్చే డబ్బునంతా.. ఆ మహిళ పేరు మీదనే పెడతారని అంటున్నారు. ఇటీవల రూ. కోటి పెట్టి కొత్త ఇల్లు నిర్మించినట్లుగా చెబుతున్నారు. హేమంత్ నేర చరిత్రను పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇంకా ఎంత మందిని ఇలా కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశారన్న అంశాన్ని బయటకు తీస్తున్నారు. 


అయితే ఎంతో భద్రత ఉండే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం ఇతర వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం ఒకటి కాదని..  ఖచ్చితంగా హేమంత్ వెనుక మరో బ లమైన శక్తి ఉండే ఉంటుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే పోలీసులు ఇప్పటి వరకూ హేమంత్ ఒక్కడే కిడ్నాప్ చేశారని చెబుతున్నారు . ఈ కిడ్నాప్ వెనుక ఏదైనా భారీ కుట్ర ఉందా లేదా అన్నది త్వరలో తేలే అవకాశం ఉంది.  ఈ అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 


కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి వివరాలు  బయట పెట్టలేదు. ఎంపీ కుటుంబం మాత్రం సేఫ్ గా  ఉందని చెబుతున్నారు. హేమంత్ అసలు డబ్బులు కోసమే కిడ్నాప్ చేశాడా లేకపోతే..   లేకపోతే ఏదైనా భూ  వివాదం ఉందా  వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది. హేమంత్..  ఇంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గరే పని చేస్తున్నారని..ఆయన  పాత్రధారుడేనని.. ఇందులో బయటకు రాని చాలా చీకటి  కోణాలున్నాయన్న ప్రచారమూ ఉద్ధృతంగా సాగుతోంది. పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టే వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.