Basara RGUKT News: బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది. వరుసగా విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినుల మృతి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
వారం వ్యవధిలోనే మరో విద్యార్థిని చనిపోవడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. రెండు రోజుల క్రితం పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని మూత్రశాలలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల లిఖిత అనే విద్యార్థిని వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. అయితే లిఖితకు తీవ్ర గాయాలు కాగా.. విషయం గుర్తించిన విద్యార్థినులు యాజమాన్యానికి తెలిపారు. స్పందించిన యాజమాన్యం వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత భైంసా ఆసుపత్రికి.. మెరుగైన వైద్యం కోసం మళ్లీ నిర్మల్ కు పంపించారు. అయితే లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆత్మహత్యా, ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు
అయితే లిఖితది ఆత్మహత్య, హత్యా అనేది తెలియట్లేదు. ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగందని చెబుతున్నారు. ప్రమాదమా, కావాలనే లిఖిత బలవన్మరణానికి పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె. గజ్వేల్ లో మిర్చిబండి నిర్వహిస్తూ.. రాజు పిల్లలను చదివించుకుంటున్నాడు. వారం రోజుల క్రితమే లిఖిత హాస్టల్ కు వెళ్లిందని... ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జీ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని మృతి దురదృష్టకరం అన్నారు. లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగిందని... ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని వీసీ వివరించారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీసీ వెంకట రమణ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. సమాధానం చెప్పకుండానే వీసీ వెళ్లిపోవడం పట్ల రెండు పార్టీల శ్రేణులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీసీ వాహనాన్ని బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నారు. పోలీసులు కలుగుజేసుకొని రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read:బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య, ఎగ్జామ్ రాసి బాత్రూమ్ కు వెళ్లి!
Also Read: శిరీషను చంపిన వ్యక్తి ఇతనే, కనిపెట్టేసిన పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్పీ