ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే క్రైమ్‌లు ఇప్పటి వరకూ చాలా జరిగాయి. అందుకే ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చే వారిని దూరంగానే ఉంచి మాట్లాడే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇల్లు అద్దెకు కావాలని వచ్చే వారిని మరింత జాగ్రత్తగా .. అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చేస్తున్న పనులు అలాంటివి మరి. 


హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో ఓ భవనంలో రెండో అంతస్తులో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది. ఇంటి యజమాని టులెట్ బోర్డు పెట్టాడు. కొంత మంది వచ్చి చూసి వెళ్లారు. రెండు రోజుల కిందట ఓ జంట వచ్చింది. ఓనర్ పోర్షన్ తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి చూసి రమ్మన్నాడు. తాను కింద గేటు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లిన జంట ఎంతకూ తిరిగిరాలేదు. పావుగంట వెయిట్ చేసి.. తన ఇల్లు అంత సేపు చూడాల్సినంత పెద్దది కాదే అనుకుని లోపలికి వెళ్లాడు. ఆయన వెళ్లే సరికి లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. 


ఇల్లు నచ్చలేదని వెళ్లిపోయారా అని అనుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటికి ఒక్కటే గేటు..   పైగా వారు తెచ్చుకున్న బైక్  కూడా  అక్కడే ఉంది. అందుకే వారు ఖచ్చితంగా లోపేలే ఉన్నారని డిసైడయ్యారు. లోనికి వెళ్లి లైట్లేశారు. అంతే ఆ ఓనర్ ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే .. ఆ జంట ఫుల్ రొమాంటిక్ మోడ్‌లో ఉన్నారు. ఎవరూ లేకుండా రూమ్ దొరికింది కదా అని తొందర పడ్డారో లేకపోతే.. పావుగంట పనికి హోటల్ రూమ్ ఖర్చు ఎందుకు దండగ అనుకున్నారో కానీ ఆ పని అక్కడ పూర్తి చేస్తున్నారు. ఓనర్ త్వరగా వచ్చేశాడో.. లేక వారే లేటయ్యారో కానీ సరసానికి బ్రేక్ పడటంతో వెంటనే బట్టలు సర్దుకుని అక్కడ్నుంచి బయటపడ్డారు. ఓనర్ పిలుస్తున్నా ఆగలేదు.  


ఇంట్లోకి అద్దెకు వస్తారేమోనని తలుపులు తెరిచి మరీ వాళ్ల సరసానికి ఉచితంగా రూమ్ ఇచ్చానని ఓనర్ తనను తాను తిట్టుకున్నాడు. అలాంటి పనులుచేసిన వారిని వదిలి పెట్టకూడదని ఇంటి బయట ఉన్నసీసీ ఫుటేజీని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ..తనతో దురుసుగా ప్రవర్తించారని కేసు పెట్టాడు.   వాళ్లు లోపల చేసిన పని చెప్పారు. కానీ ఏమని కేసులు పెట్టారో పోలీసులకు కూడా అర్థం కాలేదు. మొత్తానికి ఇలాంటి నేరాలు.. కూడా జరుగుతాయని.. జాగ్రత్తగా ఉండాలని ఇతర ఇంటి ఓనర్లకు తెలియడానికైనా కేసు నమోదు చేయించాలనుకున్నాడు ఓనర్.. అలాగే చేశాడు.