Telangana Student Missing In America: అమెరికాలో భారత సంతతి విద్యార్థుల మరణాలు, అదృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యం (Telangana Student Missing) కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. తెలంగాణలోని హన్మకొండకు (Hanmakonda) చెందిన రూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra) చికాగోలో (Chicago) విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చివరిసారిగా ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం రూపేశ్ తో తండ్రి వాట్సాప్ కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్చాఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు. అతని స్నేహితులతో మాట్లాడగా.. ఎవరినో కలవడానికి వెళ్లారని వారు ఎవరో తెలియదని రూపేశ్ స్నేహితులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని కోరారు.
ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన
'భారత్ కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతుంది. అతని ఆచూకీ తెలుసుకునేందుకు అక్కడి పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నాం.' అని చికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది. అటు దీనిపై పోలీసులు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. రూపేశ్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు.
ఈ ఏడాది ఆరంభంలోనే అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. భారతీయ సంతతి విద్యార్థులు.. అక్కడ దాడులు, కిడ్నాప్ ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికాగోలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే, హైదరాబాద్ కు చెందిన అరాఫత్ 2023 మేలో క్వీవ్ ల్యాండ్ వర్శిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్లగా.. ఈ ఏడాది మార్చి 7 నుంచి అదృశ్యమయ్యాడు. 10 రోజుల తర్వాత అరాఫత్ ను కిడ్నాప్ చేశామని.. అతన్ని విడిపించేందుకు 1200 డాలర్లు గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారని.. బాధితుడి తండ్రి తెలిపారు. ఏప్రిల్ లో సత్యసాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా రూపేశ్ అదృశ్యం కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అటు, ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా.. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.