YS Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Devireddy Siva Sankarareddy)కి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court). పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
శివశంకర్‌రెడ్డికి బెయిల్
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయనకు బెయిల్ రావడం యాధృచ్చికమే. 2019 మార్చి 15 న పులివెందులలో ఆయన ఇంట్లోనే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Viveka) అనుమానాస్పద స్థితితో చనిపోయారు. ఆయన తొలుత గుండెపోటుతో మరణించారని బయట ప్రపంచానికి చెప్పినా... ఆ తర్వాత హత్యగా తేల్చారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ(CBI) విచారణకు సైతం డిమాండ్ చేశారు. హత్యకేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... దస్తగిరి(Dasthagiri), ఉమాశంకర్‌రెడ్డి సహా కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐ(CBI) విచారణ చేపట్టగా తెలిసిన వారి పనేనని తేలింది. నిందితులుగా చేర్చి. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తో పాటు, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కీలక సీబీఐ విచారించింది.
ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి సీబీఐ(CBI) అప్రూవర్‌గా మారి సాక్ష్యమిచ్చారు. తమకు డబ్బు ఆశ చూపి భాస్కర్‌రెడ్డితోపాటు, అవినాష్‌రెడ్డి కీలక అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ హత్య చేయించినట్లు విచారణలో అంగీకరించారు. సీబీఐ 2021 సెప్టెంబర్ 17న హైదరబాద్‌లో శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ... నిందితులు బయట ఉంటే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందన్న సీబీఐ వాదనతో కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. మరోసారి శివ శంకర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో ట్రయిల్ జరిగేటప్పుడు ఏపీలో ఉండకూడదని హైకోర్టు షరతు విధించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటికీ శివశంకర్‌రెడ్డి అంగీకరించడంతో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై శివశంకర్‌రెడ్డి పులవెందులకు వెళ్లనున్నారు.
ఎన్నికలకు ముందు బెయిల్
సరిగ్గా ఎన్నికల ముందు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరుకావడంపై ఈ కేసులో కీలక సాక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు కడప జైలులో ఉండగా తనను బెదిరించాడని సీబీఐ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. రూ.20 కోట్లు ఇస్తామని ఆశ చూపారన్నారు. సీబీఐ తనను కొట్టి బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే దస్తగిరి తండ్రిపై దాడి జరిగింది. ఇదంతా తమను మట్టుబెట్టేందుకు జరుగుతున్న కుట్రేనని దస్తగిరి ఆరోపించారు. ఈ కేసులో కీలక నిందితులు బయట ఉంటే ప్రమాదమని రెండు క్రితం ఆయన ఆరోపించారు. తన తండ్రిపై జరిగిన దాడి..తనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దీనిపై సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన చెప్పిన మరుసటి రోజే ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ రావడం విశేషం.