South Indian Sweet : ఇప్పుడంటే రకరకాల స్వీట్లు అందుబాటులోకి వస్తున్నాయి కానీ.. అప్పట్లో స్వీట్స్ ఎంపిక అంటే అన్ని ఇంట్లో తయారు చేసుకునేవే ఉండేవి. బేకరీలు, డిజెర్ట్స్ ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువ. అస్సలు లేవని కూడా చెప్పవచ్చు. అన్ని స్వీట్లను ఇంట్లోనే తయారు చేసేవారు. అలాంటి నోరూరించే స్వీట్​లలో కొబ్బరి లోజు ఒకటి. దీనిని కాస్త ట్రెండీగా కొబ్బరి బర్ఫీ అంటారు. ఈ స్వీట్​ మిమ్మల్ని నోస్టాలిజికాలోకి తీసుకెళ్తోంది. 


ఈ స్వీట్​ను తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. వండడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. కానీ దీని టేస్ట్ మాత్రం మిమ్మల్ని నోరూరించేస్తుంది. పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో కొబ్బరి ఉంటే చాలు ఈ టేస్టీ స్వీట్​ను తయారు చేసుకోవచ్చు. పైగా ఇది ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో.. ఎలా టేస్టీగా దీనిని తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  


కావాల్సిన పదార్థాలు


తాజా కొబ్బరి - రెండున్నర కప్పులు


పంచదార - 2 కప్పులు


యాలకుల పొడి - అర టీస్పూన్


నెయ్యి - 1 స్పూన్


నీరు - అర కప్పు


తయారీ విధానం


ముందుగా కొబ్బరి కాయలను కొట్టి.. దానిని బాగా తురుముకోవాలి. అయితే దీనికి లేతగా ఉండే కొబ్బరికాయలు కాకుండా.. ముదురుగా ఉండే కొబ్బరి కాయలను ఎంచుకోవాలి. అప్పుడే దీని రుచి మీకు బాగా నచ్చుతుంది. అయితే కొబ్బరిని తురుముకోవడం అంటే చాలామంది కొబ్బరిని ముక్కలుగా తురిమి మిక్సీలో వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల జ్యూసీగా అయిపోతుంది. కాబట్టి మీరు నేరుగా కొబ్బరిని తురిమితే మంచిది. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ కాస్త ఓపిక ఉంటే కొబ్బరిని తురిమేసుకోవచ్చు. 


స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టాలి. దానిలో కొబ్బరి వేయాలి. దానిని వేయించుకునేప్పుడు మంచి అరోమా వస్తుంది. కాస్త జాగ్రత్తగా అక్కడే ఉండి కొబ్బరిని వేయించుకోవాలి. లేదంటే అది మాడిపోయే ప్రమాదముంది. కొబ్బరిని వేయించుకుంటున్న సమయంలో కాస్త నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో చక్కెర వేయాలి. దానిలో నీరు కూడా వేసి షుగర్ సిరప్ వచ్చేలా చేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అది కాస్త ముదిరింది అనుకుంటే.. దానిలో కొబ్బరి వేసి బాగా కలపాలి. షుగర్ కరిగి.. కొబ్బరిలో బాగా మిక్స్ అవుతుంది. దీనిని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ప్లేట్​కి నెయ్యిని అప్లై చేసి.. దానిలో కొబ్బరి మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి.


అనంతరం దానిని చాకుతో కట్ చేసుకోవాలి. లేదంటే అచ్చులలో వేసి.. బర్ఫీలుగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి అప్లై చేయడం వల్ల బర్ఫీలు ఈజీగా వస్తాయి. ఈ స్వీట్​ వారం, పదిరోజులు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే దానిలో డ్రైఫ్రూట్స్ కూడా చల్లుకోవచ్చు. ఊర్లు వెళ్లేవారికి, హాస్టల్​లో ఉండేవారికి ఈ స్వీట్​ తయారు చేసి ఇవ్వొచ్చు. లేదంటే మంచిగా వీటిని రెడీ చేసి పెట్టుకుని.. పిల్లలు స్కూల్​నుంచి వచ్చేసరికి.. రోజూ వీటిని అందిచవచ్చు. ఒకేసారి చేసుకోగలిగే రెసిపీ కాబట్టి.. మీకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. 


Also Read : దిబ్బరొట్టె చేయాలంటే కూసింత కళా పోషణ ఉండాలి.. టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ఫాలో అవ్వాలి