సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వేస్తాం వాటిని లైక్‌ చేస్తే చాలు మీకు మనీ వస్తుందని చెప్పారు. చేసేది సాఫ్ట్‌వేర్ అయినా అది నిజమని నమ్మాడో ఉద్యోగి. మొదట్లో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చారు. తర్వాతే అసలు మోసానికి తెరలేపారు. 


హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు నిలువునా ముంచేశారు. సోషల్ మీడియా పెట్టే పోస్టులను లైక్ చేస్తే చాలు అంటూ 47 లక్షలు గుంజేశారు. మొదట్లో ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన పని లేదంటూనే మొదలుపెడతారు. క్రమంగా పని కానిచ్చేసి వెళ్లిపోతారు. 


ఈ ఉద్యోగి కూడా అలానే బోల్తా పడ్డాడు. మొదట్లో నమ్మించడానికి కొంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్ చేశారు. అది నిజమే అనుకున్నాడు. అక్కడే మరో ట్రిక్ ప్లే చేస్తారు సైబర్ కేటుగాళ్లు. రోజువారిగా వచ్చే ఆదాయం మరింత పెరగాలంటే కొత్త అమౌంట్‌ కట్టాలని చెబుతారు. దీన్ని కంటిన్యూ చేయాలంటే ఓ అకౌంట్ క్రియేట్ చేస్తామని కవర్ చేస్తారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అందులో పడతాయని చెప్పారు. వాటిని నెలకోసారి తీసుకోవచ్చని చెప్పారు. దానికి ఓకే అన్నాడు. 


ఇలా పని చేస్తున్న కొద్దీ అందులో అమౌంట్‌ పడుతూ ఉంది. కానీ తీసుకోవడానికి మాత్రం వీలుపడటం లేదు. అదే విషయాన్ని అడిగితే ఏదో కారణం చెప్పి కొంత అమౌంట్‌ పే చేస్తే రిలీజ్ అవుతుందన్నారు. దాన్ని నమ్మిన ఆ వ్యక్తి ఆ డబ్బులు కట్టేశాడు. అలా విడతల వారీగా 47 లక్షలు కట్టించుకున్నారు. కానీ ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాత్రం రిలీజ్ చేయలేదు. 


ఇంత డబ్బులు పోయాక బాధితుడికి అసలు విషయం తెలిసింది. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చెప్పిన విషయాలకు బాధితుడు మరింత షాక్ అయ్యాడు. ఇలాంటి కేసులు రోజుకు పదుల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నాయని చెప్పారు. ఆరు నెలల్లోనే ఆరువందలకుపైగా కేసులు నమోదైనట్టు లెక్కలు చూపించారు. ఈ సైబర్ దందాకు ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే మోసపోతున్నారని చెప్పారు. 


ఈ దందాలో మొదట ఫారెన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడదామంటారు. ఓకే అంటే వాళ్ల మోడెస్‌ ఆపరెండీ మొదలవుతుంది. తాము కొన్ని సోషల్ మీడియా లింకులు షేర్ చేస్తామని వాటిని లైక్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్తారు. . 


 సోషల్ మీడియాలో వేసే లింక్స్‌కి లైక్‌లు చేసేందుకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదని అకౌంట్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదని కూడా చెప్తారు. ఇదే చాలా మందిని బుట్టలో వేస్తుంది. ఎలాంటి వివరాలు ఇవ్వనప్పుడు ఏమవుతుందిలే అని ప్రాసెస్‌ను కంటిన్యూ చేస్తారు. మొదట ట్రైనింగ్ కింద కొన్ని లింక్స్ పంపిస్తారు. వాటిని లైక్ చేసి స్క్రీన్‌షాట్‌ తీసి వాట్సాప్ చేయమంటారు. 
తర్వాత కమ్యునికేషన్‌కు టెలిగ్రామ్‌ లింక్‌లో జాయిన్ అవ్వాలని చెబుతారు. జాయిన్ అయితే ఏమవుతుందిలే అనుకుంటారు. అందులో లింక్‌లు షేర్ చేస్తారు. అలా వాటిని లైక్ చేసి స్క్రీన్‌షాట్స్‌ పెట్టాలి. 


మొదట రోజులు వందల్లో ఆదాయం వస్తున్నట్టు చూపిస్తారు. తర్వాత దాన్ని పెంచుకోవాలంటే ఒక్కో రేటు చెబుతారు. ఇలా వర్క్ చేసే వాళ్లకి ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. అందులో డబ్బులు భారీగానే ఉంటాయి. వాటిని తీసుకునే వీలు ఉండదు. ఆ డబ్బులు తీసుకోవాలంటే ట్యాక్స్‌ల కింద కొంత అమౌంట్‌ పే చేయాలని కలరింగ్ ఇస్తారు. ఎంత అమౌంట్‌ ఇలా పే చేసినా ఆ డబ్బులు మాత్రం మీ అకౌంట్‌లోకి రావు. 


ఆ ఖాతాల్లో భారీగా డబ్బులు ఉన్నట్టు చూపించడంతో కొంతే కదా అని చాలా మంది వారి చెప్పినట్టుగా పే చేస్తూ ఉంటారు. ఇక్కడే చాలా మంది మోసపుతున్నారు. సైడ్ ఇన్‌కం కోసం ట్రై చేసే వాళ్లు ఈ మోసాల భారిన పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.