Teacher Harassment : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులే అసభ్య పనులకు పాల్పడుతుండడం ఇటీవలి కాలంలో తరచుగా వినిపిస్తోంది. కీచక టీచర్ల ఉదంతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విద్యార్థులను మంచి దారుల్లో నడిపించాల్సిన వాళ్లే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత అత్యంత కీలకమైన స్థానంలో ఉండి రక్షణగా నిలవాల్సిన వాళ్లే మితిమీరి ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన ఘటనను మరువక ముందే రాష్ట్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల అర్థరాత్రి అసభ్య కరమైన మేసేజ్ లు పంపుతున్న కీచక టీచర్ బాగోతం తాజాగా బట్టబయలైంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలకడలో చోటుచేసుకుంది.


మోడల్ స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు  విద్యార్థినిలను లైంగికంగా వేధించడమే కాకుండా అర్ధరాత్రి అసభ్యకరంగా  మేసేజ్ లు పంపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబీకులు ఆరోపించారు.  పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులే ఇలా సెల్ ఫోన్ లో మెసేజ్ లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలకడ మోడల్ స్కూల్ దగ్గర ఆందోళన వ్యక్టం చేశారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ లీలలు బయటపడడంతో వారంతా స్కూల్ వద్దకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. సెల్ ఫోన్ లో మెసేజ్ చూపించడంతో హెడ్మాస్టర్, ఎంఈఓ వెంటనే సమాచారాన్ని తెలియజేశారు. విద్యార్థులను వేధిస్తోన్న టీచర్ చంద్రశేఖర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు


అనకాపల్లి (Anakapalli) బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో గల నేషనల్‌ టాలెంట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గత రెండు రోజుల క్రితమే జరిగింది. సబ్జెక్టులో డౌట్స్ క్లారిఫికేషన్ కోసం విద్యార్థిని, మధ్యాహ్నం లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్‌ వద్దకు వెళ్లింది. కాసేపయ్యాక రమ్మని చెప్పడంతో ఆమె సాయంత్రం అతని వద్దకు వెళ్లి అడగ్గా.. క్లాస్‌ రూమ్‌ తలుపులు మూసేసి ఉపాధ్యాయుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక ఏడుస్తూ బయటకు వచ్చి స్కూల్‌ ఆయాకు విషయం చెప్పింది. అనంతరం విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో గంగాప్రసాద్‌ మరో పాఠశాలలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి కొట్టుకుంటూ ఘటన జరిగిన స్కూల్‌కు తీసుకువచ్చి స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంగాప్రసాద్‌ను స్టేషన్‌కు తరలించారు. కాగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు నేషనల్‌ టాలెంట్‌ స్కూల్‌తో పాటు, మండలంలోని మరో రెండు స్కూళ్లలో కూడా లెక్కలు బోధిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.


Also Read : CM Chandrababu: 30 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తు చేసుకుని సీఎం చంద్రబాబుపై నీతి ఆయోగ్ చైర్మన్ ప్రశంసలు