Delhi Assembly Election Results : దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) భారీ విజయాన్ని దక్కించుకుంది. ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) 36ను దాటి దాదాపు 45 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరికాసేపట్లో ఈసీ అధికారికంగా ఫలితాలను వెల్లడించే అవకాశమున్నందున.. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయా ప్రాంతాల్లో సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ వద్ద నేతలు బాణాసంచా కాల్చి, పార్టీ జెండాలు, మోదీ ఫొటోలు పట్టుకుని, డ్యాన్సులు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. ఇక దాదాపు 27ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ అధికారంలోకి రానుండడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఆప్ కలలకు అడ్డుకట్ట వేస్తూ, ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఫలితాలను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 7గంటలకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం (BJP Office)లో పార్టీ అగ్ర నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయంపై పార్టీ శ్రేణులనుద్దేశించి మోదీ(PM Modi) ప్రసంగించే అవకాశం కన్పిస్తోంది.
ఆప్ నేతలపై కీలక వ్యాఖ్యలు
మరోపక్క ఎన్నికల్లో ఆప్ (AAP) వెనుకంజపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా (Virendra Sach Deva).. ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పూర్తి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించారని, ఢిల్లీలో సమస్యల నివారణ కోసమే తాము ఎన్నికల్లో పోరాడమన్నారు. కానీ సమస్యల నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నం చేసిన అరవింద్ కేజ్రీవాల్ కి, అవినీతికి వ్యతిరేకంగా ఓటు చేశారని వీరేంద్ర విరుచుకుపడ్డారు. ఈ కారణంగానే ఎన్నికల్లో కేజ్రీవాల్, సిసోడియా, అతిషి ఓటమిని చూడపోతున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయినా అది తమకు పెద్ద సమస్య కాదని, ఢిల్లీకి సీఎం ఎవరుంటారన్న విషయంపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు.
అధికార దాహంతోనే కేజ్రీవాల్ కు ఓటమి
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare).. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని చెప్పారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా, డబ్బు, అధికారాన్ని సైతం దుర్వినియోగం చేశారని, అందుకే ప్రజలకు కేజ్రీవాల్ ను ఓడించారన్నారు.
దూసుకుపోతున్న బీజేపీ.. వెనుకంజలో ఆప్
కేజ్రీవాల్, సిసోడియా లాంటి అగ్ర నేతలు జైలుకెళ్లడం, పలు అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడంతో పలువురు ఆప్ నేతలు బీజేపీలో చేరారు. దీంతో కొన్ని ముఖ్యమైన స్థానాల్లోనూ బీజేపీకి విజయావకాశాలు పెరిగాయి. అప్ అగ్రనేతలు, మంత్రులు సైతం వెనుకంజలో ఉండగా.. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీ హవా కొనసాగిస్తోంది.
Also Read : PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్