AIIMS Visits Suman Bheri: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ - ఎయిమ్స్ ను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్నంలోని బృందం సందర్శించింది. ఎయిమ్స్ పురోగతి, రోగులకు అందుతోన్న సైవలపై ఎయిమ్స్ వైద్యులు, అధికారులతో భేరి సమీక్షించారు. ఆచరించాల్సిన పనులపై సూచనలు చేశారు. ఆ తర్వాత వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెమ్ శాంతాసింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రోగులకు అందుతోన్న సేవలు, మౌలిక వసతులు, సౌకర్యాలు లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య, నర్సింగ్ విద్యార్థులకు బోధనపై ఆరా తీసిన ఆయన.. వారు ఏయే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారో తెలుసుకున్నారు. అన్ని వివరాలు తెలుసుకుని, పరిశీలించిన తర్వాత ఆస్పత్రి ప్రశాంత వాతావరణంలో ఉందని, సిబ్బంది వసతి గృహాలున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు విషయాలపై ఆస్పత్రికి సంబంధించిన నివేదికలను ఉప సంచాలకులు కల్నల్ శశికాంత్ తుమ్మా, సుమన్ భేరీ బృందానికి అందజేశారు.
సీఎంను ప్రశంసించిన సుమన్ భేరి
ఈ క్రమంలోనే సుమన్ భేరీ, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. 30 ఏళ్ల కిందట హైదరాబాద్ లో చంద్రబాబును కలిసినప్పటికి సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన పాలసీలు, సంస్కరణలను తర్వాతి కాలంలో ప్రతి దేశమూ పాటించిందని చెప్పారు. దేశంలో ఎంతో మంది సీఎంలున్నప్పటికీ సంస్కరణలను అనుకూలంగా చేసుకుని ప్రజలకు మేలు చేసిన నేత చంద్రబాబేనని కొనియాడారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఆలోచనలను అమలుచేసే నాయకులతోనే ప్రజల జీవితాలు మారుతాయని, ఐటీకీ ప్రోత్సాహం, విమానాశ్రయాలు, పీపీపీ పద్దతుల్లో రహదారుల నిర్మాణం లాంటి ఎన్నో ఆవిష్కరణలకు చంద్రబాబు నాంది పలికారన్నారు.
రాష్ట్రం ముందున్న సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ లో తాను డెవలప్ చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అదే తరహాలో ఏపీలోనూ అమలు చేయనున్నామన్నారు. పారిశ్రామిక కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతులు వంటి వాటిని బలోపేతం చేయడంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పని చేయాలని సీఎం ప్రతిపాదించారు.
నీతి ఆయోగ్ సహకారంతోనే సాధ్యం
అంతకుముందు సచివాలయంలో సుమన్ భేరీ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన చంద్రబాబు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంటర్ ప్రెన్యూర్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని స్పష్టం చేశారు. దేశంలోని 4 గ్రోత్ హబ్ లలో ఒకటైన విశాఖ ఆర్థిక ప్రాంతంతో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయాభివృద్ధి హబ్ లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో 2029కల్లా 11వేలకు పైగా ఈవీ బస్సులను అందుబాటులోకి తేవడంతో పాటు అన్ని బస్సు స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం తీసుకున్న నదుల అనుసంధానం, పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మాణం, 2047 విజన్ లోని పది సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యమివ్వాలని సీఎం తెలిపారు. ఏటా 15శాతం వృద్ధి రేటుతో 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని చంద్రబాబు సూచించారు. అనంతరం సీఎం ప్రతిపాదించిన అంశాలన్నింటిపైనా సుమన్ భేరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికిది అనుకూల సమయమని, అభివృద్ధికి ఆస్కారముందని చెప్పారు. ఇందుకు నీతి ఆయోగ్ కచ్చితంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.