Tamil Nadu News: మద్యం మత్తు, క్షణికావేశం మనిషితో ఎంతటి అఘాయిత్యమైనా చేయిస్తుందనే విషయానికి సాక్ష్యం ఈ వార్త. తాగిన మైకంలో కన్నతల్లైన వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బతికుండగానే ఆమెను చేయిపట్టి లాక్కెళ్లి భూమిలో పాతి పెట్టాడు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపం సిత్తామూర్ కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడికి పెళ్లవగా.. అతను తరచుగా భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భరించలేని ఆమె పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అతను తల్లి యశోదతో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు.
నిత్యం మద్యం తాగే అలవాటున్న శక్తివేల్.. తల్లితో తరచూ గొడవ పడేవాడు. భయంతో ఆమె రాత్రి వేళల్లో ఎదురింట్లో నిద్రించే వారు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన శక్తివేల్ తల్లితో మరోసారి గొడవ పడ్డాడు. తర్వాత యశోద కనిపించలేదు. దీంతో ఆమె ఎక్కడకు వెళ్లిందని ఇరుగు పొరుగు వారంతా గాలించారు. ఎంతకూ ఆమె జాడ కనిపించలేదు. ఇంటికి తాళం వేసి ఉండడంతో.. ఇంటి వెనకాలకు వెళ్లి వెతికారు.
శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనక వైపు వెళ్లి పరిశీలించారు. యశోద చీర కిందపడి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపలే ఉన్న శక్తివేల్ వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనికి స్థానికులు దేహశుద్ధి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే తల్లిపై దాడి చేశానని.. తలకు తీవ్ర గాయమై స్పృహ తప్పి పడిపోయిందని తెలిపాడు. ఆ తర్వాత ఇంటి వెనక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు. పోలీసులు వచ్చి ఆమెను పూడ్చిన ప్రాంతంలో తవ్వి తీసి చూసేలోపు తల్లి చనిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.
నెల్లూరులో పిల్లలంతా చూస్తుండగా ఆయా హత్య..!
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో దారుణం జరిగింది. స్కూల్ పిల్లలు చూస్తుండగానే ఆ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వండే ఆయాను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. పిల్లలందరూ మధ్యాహ్నం భోజనానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. భయంతో క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, విరువూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఎప్పటిలాగే రోజు స్కూల్ కి వచ్చారు విద్యార్థులు. మధ్యాహ్న భోజనం వండే ఆయా విజయలక్ష్మి కూడా ఉదయాన్నే స్కూల్ కి చేరుకుని వంట పని ప్రారంభించింది. వంట పూర్తయింది. మధ్యాహ్నం పిల్లలు భోజనం కూడా తిన్నారు. అయితే అంతలోనే ఊహించని ఘటన జరిగింది. విజయలక్ష్మి కూడా ప్రమాదాన్ని ఊహించలేదు. ఆమె భర్త వెంకటేశ్వర్లు స్కూల్ కి వచ్చాడు. భర్తను చూసిన విజయలక్ష్మి కీడు శంకించింది. అప్పటికే వారి మధ్య గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అతను సడన్ గా స్కూల్ కి వచ్చేసరికి విజయలక్ష్మి భయపడింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేలోగా వెంకటేశ్వర్లు దాడికి తెగబడ్డాడు. తనతోపాటు తెచ్చుకున్న కత్తిని తీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన విజయలక్ష్మికి తీవ్ర రక్తస్రావం అయింది. స్కూల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. పోలీసులు సమాచారం అందుకుని స్కూల్ వద్దకు వచ్చారు. హంతకుడు వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోయాడు.
అనుమానమే పెనుభూతమై
భార్య విజయలక్ష్మిపై భర్త వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమెతో చాలాసార్లు వాగ్వాదం జరిగింది. ఇంటి చుట్టుపక్కల వారికి కూడా వీరి గొడవలు తెలుసు. ఇటీవల అనుమానం మరింత పెరిగిపోయిందని అందుకే తరచూ గొడవలు పడేవారని అంటున్నారు చుట్టుపక్కల వారు. అయితే ఈరోజు సడన్ గా వెంకటేశ్వర్లు భార్యని హతమార్చడం మాత్రం దారుణం అని అంటున్నారు.