Man and daughter found dead inside flat in Chennai | చెన్నై: ఐదు నెలల నుంచి తండ్రి, కుమార్తె మృతదేహాలు ఓ అపార్ట్‌మెంట్ లో ఉంచిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లో జరిగింది. వాసన రాకుండా మృతదేహాలపై రసాయనాలు చల్లుతూ కొన్ని నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఏసీ పనిచేయకపోవడం, చుట్టుపక్కల వారికి వాసన రావడంతో ఎట్టకేలకు అపార్ట్‌మెంట్లో అస్తి పంజరాల మ్యాటర్ బయటకు వచ్చింది. వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్(70), ఆయన కుమార్తె సింధియా (37) ఎన్నో నెలల కిందటే చనిపోగా, వీరి మృతదేహాలు కుళ్లిపోయి, అస్తిపంజరాలుగా మారాయి.


అసలేం జరిగిందంటే..
వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్ కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయన కుమార్తె సింథియా తండ్రికి మెరుగైన వైద్యం కోసం చూస్తుండగా.. సోషల్ మీడియాలో పరిచయమైన డాక్టరు శామ్యూల్‌ ఎబినేజర్‌కు విషయం చెప్పింది. తన ఇంట్లో ఉంట్లో చికిత్స తీసుకోవాలని శామ్యూల్ శంకర్‌ను చెన్నై తిరుముల్లైవాయల్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాడు ఎబినేజర్. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న శామ్యూల్ శంకర్ చనిపోయారు. 


తల్లికి తెలిస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదమని భావించిన డాక్టర్


ఆయనది సహజ మరణమే అయినా, తన తండ్రి మృతికి కారణమని ఆరోపిస్తూ డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్‌ తో గొడవకు దిగింది సింధియా. వీరి మధ్య జరిగిన వాగ్వాదంలో డాక్టర్ ఆమెను నెట్టివేయడంతో కింద పడగా, తలకు బలమైన గాయమై మృతిచెందింది సింధియా. ఇద్దరి మృతి బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మాస్టర్ ప్లాన్ వేశాడు డాక్టర్ శామ్యూల్‌ ఎబినేజర్‌. డెడ్ బాడీస్‌ను తన అపార్ట్‌మెంట్‌లోనే ఉంచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని అప్పుడప్పుడూ అక్కడికి వచ్చి వాటిపై రసాయనం చల్లుతూ వస్తున్నాడు. ఏసీ ఆన్ చేసి ఉంచి, తాను కాంచీపురంలో ఉండేవాడు. కొన్ని రోజుల కింద హార్ట్ సర్జరీ చేయించుకున్న తన తల్లికి విషయం తెలిస్తే ఆమెకు ప్రమాదమని ఐదు నెలల నుంచి విషయం బయటకు రానివ్వలేదు. ఎలాంటి అనుమానం రాకూడదని బంధువులు, స్నేహితులతో తరచుగా ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ లో క్యాజువల్‌గా మాట్లాడుతుండేవాడు.


ఎలా బయటకు వచ్చిందంటే..
కొన్ని నెలలుగా ఏసీ ఆన్‌లోనే ఉండటంతో జనవరి 29న పాడయింది. డాక్టర్ అపార్ట్ మెంట్ నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. శామ్యూల్ ఎబినేజర్ రూం తాళాలు పగలగొట్టి వెళ్లి చూసిన పోలీసులు, స్థానికులు షాకయ్యారు. డాక్టర్ ఫ్లాట్‌లో ఇద్దరి శవాలు కుళ్లిపోయి అస్తిపంజరాలుగా కనిపించాయి. డాక్టర్ ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, తరువాత పుళల్ జైలుకు తరలించారు. ఆ మృతదేహాలు శామ్యూల్ శంకర్, సింథియాలవని చెప్పిన నిందితుడు.. తాను ఎవరినీ హత్య చేయలేదన్నాడు. శామ్యూల్ శంకర్ అనారోగ్యంతో చనిపోగా, తనతో జరిగిన గొడవలో కిందపడి తలకు గాయమై సింథియా చనిపోయినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు.


Also Read: Real Estate: ప్లాట్లు అమ్ముడుపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - సూసైడ్ నోట్ లభ్యం