Student Commits Suicide In Araku Ashram School : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మధ్యాహ్నం వసతి గృహంలో భోజనం చేసి వచ్చిన తర్వాత బాలిక ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ బాలిక స్వగ్రామం దుంబ్రిగూడ  మండలం  కొండ్రుం పంచాయతీ ఒంబి గ్రామంగా అధికారులు చెబుతున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


ఫ్యాన్ కు ఉరేసుకుని ఉన్న బాలికను సహచర విద్యార్థులు గుర్తించి అధికారులకు తెలియజేయడంతో విషయం బయటకు వచ్చింది. అప్పటివరకు తమతో ఉన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు ఆవేదనతో బోరుమని విలపించారు. బాలిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. బాలిక మృతికి కారణాలను గుర్తించడంపై పోలీసు అధికారులు దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు. 


గంట ముందే హాస్టల్ కు వచ్చిన విద్యార్థి 
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఈ నెల 9వ తేదీన సెలవు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళిందని వసతి గృహ అధికారులు వెల్లడించారు. మంగళవారం 11 గంటలకు సమయంలో హాస్టల్ కు వచ్చిందని తెలిపారు. వచ్చిన గంట తర్వాత సహచరులతో మాట్లాడుకుంటూ భోజనం చేసిందని, అనంతరం రూమ్ లోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాలిక డ్రాప్ అవుట్ స్టూడెంట్ అని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత ఏడాది సెప్టెంబర్ లో హాస్టల్లో చేర్చుకున్నట్లు వివరించారు. హాస్టల్లో చేరినప్పటి నుంచి రెగ్యులర్గా స్కూలుకు వెళుతూ ఉందని, ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అధికారుల అనుమతితో వెళుతుందని అధికారులు స్పష్టం చేశారు. గ్రామం నుంచి వచ్చిన తర్వాత ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందో తెలియడం లేదంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సహచర విద్యార్థులకు కూడా ఏమీ చెప్పలేదని అధికారులు గుర్తించారు.