Bonda Umamaheswara Rao:  కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బొండా ఉమ  ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అంటూ ఎద్దేవా చేశారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని.. కేసుల భయంతోనే తన ట్రావెల్స్ సంస్థను మూసేశారని చెప్పారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయని వెల్లడించారు.


కేశినేని నానికి రెండు వేల కోట్లు ఎక్కడివి ? 


2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 37 కోట్లు.. అప్పులు రూ. 66 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని ఆస్తుల విలువ రూ. 66 కోట్లు.. అప్పులు రూ. 51 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100 శాతం మేర పెరిగాయి. 2014 కంటే 2019లో అప్పులూ తగ్గాయి. అంటే 2014-19 మధ్య కాలంలో ఆయన ఆస్తులు పెరిగి అప్పులు తగ్గాయి. రూ. 2 వేల కోట్ల ఆస్తులను కేశినేని నాని ఎప్పుడు అమ్ముకున్నాడు?.


సుజనా సిఫారసుతో టీడీపీ టిక్కెట్ 


”ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని నాని టీడీపీలో చేరి.. ఎంపీ టికెట్ తీసుకున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం పని చేస్తానంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారు. కేశినేని నానికి టిక్కెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర ఉంది. సుజనానే చంద్రబాబుకు నచ్చచెప్పి టికెట్ ఇప్పించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కేశినేని నాని తరపున సుజనానే డబ్బు ఖర్చు పెట్టారు.. చంద్రబాబు దయతో గెలిచారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని టికెట్ తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ టికెట్ రావడానికి కారణం లోకేశ్. రెండు సార్లు పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. 


జగన్ ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వరు ! 


వైసీపీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి కేశినేని నాని దిగజారిపోయాడు. వైసీపీలో ఆయనకు ఎంపీ టిక్కెట్ లేదు. కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకుని.. సంస్థ పేరు మార్చేశాడు. రూ. 40 కోట్ల అప్పు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేంజ్ రోవర్ కారు కిస్తీలు కట్టడం లేదు.. ఆ కారును దాచేశారు. అన్నం పెట్టిన ఇంటికి కేశినేని నాని సున్నం పూసే రకం. ఇవాళ చంద్రబాబును ఎంతలా విమర్శిస్తున్నారో.. జగన్ను కూడా అదే స్థాయిలో విమర్శిస్తాడు. కేశినేని నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. చంద్రబాబును విమర్శిస్తే తిరగనివ్వం. నా మీద కేశినేని నాని నిలబడితే డిపాజిట్ కూడా రాదని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.


కేశినేని ట్రావెల్స్ మూసేయడానికి కారణం ఇదీ ! 


ఓ బస్సుకు పర్మిట్ తీసుకుని కేశినేని నాని తన ట్రావెల్సుకు చెందిన నాలుగు బస్సులను అక్రమంగా తిప్పేవారు.  ఆనాటి ట్రాన్సపోర్ట్ కమిషనర్ బాల సుబ్రమణ్యం ఇదే కేసును  పట్టుకున్నారు. బాలసుబ్రమణ్యం విచారణ మొదలు పెట్టడంతో కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని  మూసేశారని  బొండా ఉమ తెలిపారు.  తన పీకకు ఈ కేసు చుట్టుకుంటుందనే కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసేశారని ఆరోపించారు.