Srikalahasti News :  చదువు కోవడానికి కాలేజీ వెళ్తునే వారిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు.. ప్రేమ అనే‌ లోకంలో ఇద్దరూ విహరించారు. జీవితాంతం కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరికి వేరు వేరు వివాహాలు చేశారు. ప్రియుడు ఓ చోటు ఉంటే..ప్రియురాలు మరోక చోట ఉంటూ వారి ప్రేమ జీవితాన్ని గుర్తుచేసుకునేవారు. ఇంతలో ప్రియురాలి జీవితంలో అనుకోని ఘటన జరిగింది.  


అసలేం జరిగింది? 


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో నివాసం ఉంటున్న వేణు (26) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డారు. తొలిచూపులోనే ఇద్దరు మనసు కలవడంతో ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఒకానొక సమయంలో చదువును సైతం పక్కన పెట్టి మరి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెద్దలకు తెలియకుండా చెట్టాపట్టాలేసుని తిరుగుతూ ప్రేమలోకంలో‌ బాగా మునిగిపోయారు. ఇంతలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం‌ కాస్తా ఇంట్లో తెలిసిపోయింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకుండా యువతికి మరొకరితో వివాహం జరిపించారు. దీంతో ఆ ఇద్దరు ప్రేమికులు విడిపోవాల్సి వచ్చింది. ఇద్దరు వేరువేరు వివాహాలు చేసుకున్నారు. వేర్వేరు పెళ్లిళ్లు అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోయారు. 


స్వర్ణముఖి నదిలో దూకిన ప్రేమజంట 


అదే సమయంలో‌ యువతి వైవాహిక జీవితంలో అనుకోని ఘటనలు ఎదురయ్యాయి. యువతి తన భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు నెల ముందే వేణు మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ ప్రేమికుల కలయికకు పెళ్లి అడ్డురాలేదు. వారిద్దరూ ప్రేమించుకునే రోజులు గుర్తు చేసుకున్నారు. కన్న కలలను గుర్తుకు తెచ్చుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రేమను సమాజం ఒప్పుకోదని భావించి కలిసైనా చావును పంచుకోవాలని భావించారు. సోమవారం అర్ధరాత్రి శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. తమ ప్రేమకు అడ్డుచెప్పిన పెద్దలకు తమ చావుతో గుణపాఠం చెప్పాలని భావించి చేయి చేయి పట్టుకుని ఒక్కసారిగా స్వర్ణముఖి నదిలోకి దూకేశారు. ఇంతలో రాత్రి బీట్ లో ఉన్న శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కన్నయ్య వారిద్దరూ నదిలోకి దూకడాన్ని‌ గమనించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి విషయం చెప్పి పోలీసు బృందాన్ని అక్కడికి పిలిపించాడు. ప్రాణాంతకమైన మురుగు నీటిలో కానిస్టేబుల్ కన్నయ్య దూకి ప్రేమ జంటను అర్ధరాత్రి ఒడ్డుకు చేర్చి వారిద్దరిని ప్రాణాలతో కాపాడాడు. కానిస్టేబుల్ కన్నయ్యకు తోటి పోలీసు‌ బృందం రవిచంద్ర, గిరిబాబు ,మునీంద్ర సాయం అందించారు. అనంతరం వీరిద్దరి పోలీసు‌ స్టేషన్ కు తరలించి‌ తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.