Tekkali SI : శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై హరికృష్ణ పై వేటు పడింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో మహిళా డ్యాన్సర్లతో కలిసి డాన్స్ చేసిన టెక్కలి ఎస్సై హరికృష్ణ పై ఉన్నతాధికారులు వేటువేశారు. అశ్లీల దుస్తులతో నృత్యం చేస్తున్న డాన్సర్స్ సరసన ఎస్ఐ చిందులు వేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సై హరికృష్ణ ను వీఆర్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నౌపడ ఎస్సై మహమ్మద్ అలీకి టెక్కలి ఇన్చార్జ్ ఎస్సై గా బాధ్యతలు అప్పగించారు.


అసలేం జరిగింది? 


టెక్కలి ఎస్సై హరికృష్ణకృష్ణలీలలు చూపారు. ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకల్లో ఒళ్లు మరచి నృత్యాలు  చేశారు. ఇలాంటి అశ్లీల డ్యాన్సులను అదుపు చేయ్యాల్సిన పోలీస్ అధికారి మైమరిచి యువతులతో అశ్లీల నృత్యాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్  జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది.  టెక్కలి వెంకటేశ్వర కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేస్తుంటే ఆపాల్సిన టెక్కలి ఎస్సై వారితో జత కలిసి స్వామి భక్తి చాటుకున్నారు. యువతులతో కలిసి ఒళ్లు మరిచి స్టెప్పులేశారు. అధికారం ఆడవారితో అశ్లీల నృత్యాలు చేయించుకోవడానికా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున అర్ధరాత్రి వరకు సాగిన ఈ వికృత చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 



విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై ఇద్దరు పోలీసులు సస్పెండ్ 


ఇటీవల పవన్‌ కల్యాణ్‌ విశాఖ రాక సందర్భంగా ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్‌ సీఐ ఉమాకాంత్‌, ఏసీపీ టేకు మోహన్‌రావుపై సస్పెన్షన్‌ వేటు  వేసింది పోలీస్ శాఖ. అక్టోబరు 15న  వైసీపీ పార్టీ విశాఖగర్జన సభ నిర్వహించడం, అదే సమయంలో జనవాణి పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చారు. అయితే రాష్ట్ర మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నుంచి తిరుగు ప్రయాణానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం, అదే సమయంలో విశాఖ వస్తున్న పవన్ కు స్వాగతం పలకడానికి భారీగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎయిర్ పోర్టు కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి రోజాపై ఉద్దేశ పూర్వకంగా హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో  రోజా పీఏకు గాయాలయ్యాయి. 


సీఐ, ఏసీపీ పై వేటు 


విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలపై దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ...  ఘటన జరిగిన సమయంలో ఎయిర్‌పోర్ట్‌ సీఐ ఉమాకాంత్‌ (2004వ బ్యాచ్‌), ఇన్ఛార్జ్ ఏసీపీ టేకు మోహన్‌రావు (1989వ బ్యాచ్‌) నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దర్నీ సస్పెండ్‌ చేశారు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన అధికారులు ఎయిర్‌పోర్ట్‌ లోపలే ఉన్నారని, మంత్రుల్ని లోపలికి పంపించడంలో అప్రమత్తంగా లేరని పోలీస్‌శాఖకు నివేదిక అందింది. అంతేకాకుండా ఆ రోజు పవన్ రోడ్ షో సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో విశాఖ పోలీసులు ఫెయిలయ్యారంటూ సాక్ష్యాత్తూ మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఐ, ఏసీపీలపై సస్పెన్షన్‌ విధిస్తూ పోలీస్‌ శాఖ తాజా ఉత్తర్వులు ఇచ్చింది.