Srikakulam Kidnap : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వాణిజ్య కేంద్రంలో ఓ యువతి కిడ్నాప్ యత్నానికి గురైన ఘటన కలకలం రేపింది. సూది కొండ నుంచి హుదుద్ గృహాల ప్రాంతానికి యువతిని బలవంతంగా తీసుకెళ్లి దాదాపు ఆరుగంటలపాటు బంధించారు. కుటుంబసభ్యులు స్థానికులు యువతి కోసం వెతగ్గా చివరకు చున్నీతో బంధించిన వైనాన్ని గుర్తించి సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అలజడి రేపుతుంది. సూదికొండకు సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడు థియేటర్ అడ్రసు అడగగా ఆమె చెప్పెలోపే చున్నీతో కట్టి బలవంతంగా పట్టుకుపోయారని బాధితరాలు చెబుతుంది. కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో పాడుపడిన భవనాలు చూసి ఆశ్చర్యపోయారు. అసలు కిడ్నాప్ కు యత్నించిన వారేవరై ఉంటారనేది అంతు చిక్కడంలేదు. హిందీ , తెలుగు భాషలో మాట్లాడుకున్నారని చెప్పడంతో పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయికి ఎటువంటి హాని కలుగకుండా బయటపపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమౌదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
వరంగల్ లో బాలిక కిడ్నాప్
వరంగల్ లో బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"దుకాణానికి వెళ్లిన చిన్నారిని ముగ్గురు వ్యాన్ లో వచ్చి కిడ్నాప్ చేశారు. ఛాయ్ తాగేందుకు ఆగినప్పుడు బాలికకు మెళకువ వచ్చింది. చిన్నారి వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటబడ్డారు. అయితే అక్కడున్న వాళ్లు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చెప్పడంతో ఆ ముగ్గురు అక్కడ నుంచి పారిపోయారు. ముఖానికి కర్ఛీఫ్ తో ముగ్గురు వచ్చారని అమ్మాయి చెబుతోంది." - చిన్నారి బంధువు
"పాప షాపునకు వెళ్లింది. అమ్మాయి రోడ్డు దాటేవరకూ అక్కడే నిలబడ్డాను. పది నిమిషాలు అయినా ఇంకా పాప రాలేదు. మా అబ్బాయిని పంపి షాపు వద్ద అడిగితే ఎవరు రాలేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాను. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అక్కడ కూడా చూశాం, కానీ అక్కడికీ వెళ్లలేదు. ఇంతలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పాప వరంగల్ లో ఉందని ఫోన్ వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందని అడిగితే ఎవరో వ్యాన్ లో తీసుకొచ్చారని బాలిక చెప్పింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాం. "- బాలిక తల్లి