Srikakulam Honey Trap Case : శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి, నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని భీమిలి (Bhimili Police) పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో పేరుతో వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం, దాడి చేయడం హనీ ట్రాప్ కేసుల్లో అసలు లక్ష్యం. కొన్ని రోజుల క్రితమే వైజాగ్ (Visakhapatnam)లో హనీ ట్రాప్ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న మరో కేసులో శ్రీకాకుళం (Srikakulam)కి చెందిన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


అసలేమైందంటే...


ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ కేసులు (Honey Trap Case) మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఓ మహిళ బాధితులకు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఆ తర్వాత తమను ఓ చోటుకి రమ్మని, వారిపై దాడి చేసి, ఉన్నదంతా కాజేస్తారు. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ మధ్య ఓ కేసు బయటపడింది. కంచరపాలేనికి చెందిన ఓ వివాహిత, సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. అలా పక్కా ప్లాన్ చేసి పాతపట్నానికి చెందిన రామారావు ను లక్ష్యంగా చేసుకున్నారు. అలా జనవరి 18న ఆ యువతి రామారావుకి ఫోన్ చేసి, ఆకట్టుకునే మాటలతో తనవైపుకు తిప్పుకుంది. తాను జనవరి 19న విశాఖకు వస్తానని, ఆ రోజు ఇద్దరం కలుసుకుందామని చెప్పడంతో.. అప్పటికే ఆమె మాయ మాటలు నమ్మిన మత్తులో ఉన్న రామారావు కూడా అందుకు ఓకే చెప్పేశాడు. 


చెప్పినట్టుగానే ఆ యువతి ఆ రోజున రామారావుకు ఫోన్ చేసింది. అప్పుడే తన కుమార్తెను బోయిపాలెం వద్ద హాస్టల్‌లో దింపేసి వెళ్లిపోతున్న రామారావు.. యువతి చెప్పిన తగరపువలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లాడు. అంతలోనే అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు రూ.50వేలు, ఏటీఎం (ATM) కార్డులు లాక్కున్నారు. ఆ తర్వాతి రోజు వారు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.7 వేలు కాజేశారు. దీంతో తన నగదు మాయంపై బాధితుడైన రామారావు భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. తన జరిగిన విషయాన్ని మొత్తం తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలా ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతకీ ఆ యువతి ఎవరు, ఇప్పటివరకు ఎంత మందిని మోసం చేసింది అన్న పలు విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Also Read : Republic Day Parade 2025 : ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే - 15వేల మంది పోలీసులు, 6 అంచెల భద్రత, వేల సీసీ కెమెరాలతో పూర్తి నిఘా