Srikakulam News : ఎచ్చెర్లలో విషాదం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల సాయుధ దళాల విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎం. సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్తవానికి సోమవారం వీధుల్లో ఉండాల్సి ఉండగా.. డ్యూటీ మధ్యలో నుంచి వచ్చి ఇంటి దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బాక్సర్ గా ఎన్నో పతకాలు సాధించిన సుబ్బారావు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించారు. సీనియర్ బాక్సర్ గా పేరు పొందిన సుబ్బారావు కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే కుమారుడికి వివాహమైన అనంతరం సుబ్బారావు భార్య మంచం పట్టింది. వివాహమైన కుమారుడు తన భార్యతో పాటు వేరే కాపురం పెట్టడంతో మంచం పట్టిన భార్యకు సేవలు చేయడం సుబ్బారావుకు తలకు మించిన భారమైంది. ఇదే విషయమై ఆదివారం కుమారుడు, సుబ్బారావు మధ్య వివాదం జరిగినట్టు సమాచారం. మనస్తాపానికి గురైన సుబ్బారావు రోల్ కాల్ పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య


ఇటీవల కాకినాడ జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల కృష్ణ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై స్వగ్రామం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట. గురువారం కోనసీమలో సీఎం బందోబస్తు ఏర్పాట్లకి వెళ్లి వచ్చారు ఎస్సై గోపాలకృష్ణ. ఆయన 2014 సంవత్సరం బ్యాచ్ కు చెందిన వారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, ఓ గదిలో పిల్లలు భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


భార్యాభర్తలు సూసైడ్ 


జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుంది. సింహారాజు మునింధర్(65),  సులోచన(60) పలు రకాల ఇబ్బందులతో మనస్థాపానికి గురి అయ్యి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత పురుగుల మందు తాగి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఓ గదిలో పురుగుల మందు సేవించి పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపు ఇద్దరూ మృతిచెందారని వైద్యులు తెలిపారు. వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..