Satysai District Crime News: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల రాళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం ఎరుగని ఆరవ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
అసలేం జరిగిందంటే?
నల్ల రాళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు... అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థినిపై కన్నువేశాడు. ఈ క్రమంలోనే కొంత కాలంగా ఆ చిన్నారితో మాటలు కలుపుతూ వచ్చాడు. ఈరోజు బాలికకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేయబోయాడు. అయితే బాలిక గట్టిగా ఏడ్వడంతో సదరు నిందితుడు పారిపోయాడు. దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా... బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నల్ల రాళ్లపల్లి గ్రామానికి చేరుకుని శ్రీనివాసులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఓ అత్యాచార ఘటన కలకలం
తిరుపతి జిల్లాలో ఈ మధ్య ఓ దారుణమైన ఘటన జరిగింది. ఓ వివాహితను నాగరాజు అనే వ్యక్తి నిర్బంధించి నెల రోజులు పాటు అత్యాచారం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తిరిగి వివాహిత నివసిస్తున్న గ్రామంలో వదిలి పెట్టాడు.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వివాహిత తిరుపతి రూరల్ మండలంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. తిరుపతిలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. అయితే చిగురువాడ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నవంబర్ 17న వివాహిత పని చేస్తున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. వివాహితకు బ్యాంకు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన వివాహిత నాగరాజును ప్రతిఘటించడంతో నాగరాజు ఆమెపై దాడి చేశాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాకాల మండలం దామలచెరువులోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు. వివాహిత చనిపోతానని చెప్పడంతో భయపడ్డ నాగరాజు ఆమెను స్వగ్రామంలో వదిలిపెట్టాడు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మానసికంగా కుంగిపోయిన వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అడ్డుకుని ధైర్యం చెప్పారు. గ్రామస్తులు సహకారంతో జనవరి 6న తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది వివాహిత. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారు. డీఎస్పీ రామరాజు కేసుపై నిర్లక్ష్యం వహించి, నిందుతుడిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాధితురాలు బంధువుల సహాయంతో డీఎస్పీని వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేయాలని దళిత సంఘాలు నేతలతో కలిసి చంద్రగిరిలో మీడియాతో గోడు చెప్పుకున్నారు.