Sri Sathya Sai District: రోజురోజుకూ స్థిరాస్తులను కాజేసే అక్రమార్కులు పెరిగిపోతున్నారు. డబ్బులు, ఆస్తుల కోసం కొందరు కన్నవాళ్లని, అయిన వాళ్లని కూడా చంపేస్తున్నారు. మరికొందరేమో యజమానులకు తెలియకుండానే వారి ఆస్తులను వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారు. వాళ్లు బతికుండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వారసులుగా వేరే వాళ్లను చూపిస్తూ కోట్లు విలువ చేసే ఆస్తులను కాజేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
శ్రీసత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువుకు చెందిన శ్రీరామ్ నాయక్, కాంతమ్మ భార్యాభర్తలు. ఉపాధి నిమిత్తం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వలస వచ్చారు. వంట పని చేసుకుంటూ వచ్చిన రూపాయి, రూపాయి కూడబెట్టుకున్నారు. అయితే సొంత ఊళ్లో తమకంటూ ఓ ఇల్లు ఉండాలని భావించిన దంపతులు.. అలా పోగేసిన డబ్బుతో అనంతపురంలోని ఆదర్శ నగర్ లో 5 సెంట్ల స్థలం కన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2014లో.. హైదరాబాద్ లోనే హౌస్ లోన్ తీసుకొని మరీ ఇల్లు కట్టుకున్నారు. హైదరాబాద్ లో రుణం తీసుకున్నందున వారు భాగ్యనగరంలోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు అనంతపురంలోని ఇంటిని అద్దెకు ఇవ్వలాని నిర్ణయించుకొని కిరాయికిచ్చారు.
అప్పులు పెరిగాయని..
రోజురోజుకూ వడ్డీ భారం పెరగడంతో అప్పులు ఎక్కువయ్యాయి. అప్పుల బాధ పడలేక ఆ ఇంటిని అమ్మేసి అప్పు తీర్చేయాలని భావించారు. దాదాపు 10 మంది ఏజెంట్లకు ఇంటి పత్రాల జిరాక్సులు ఇచ్చారు. అయితే వారి ద్వారా శ్రీరామ్ నాయక్, కాంతమ్మ దంపతులకు ఓ విస్తుపోయే వాస్తవం తెలిసింది. శ్రీరామ్, కాంతమ్మ చనిపోయినట్లు కొందరు అక్రమార్కులు ధ్రువ పత్రాలు సృష్టించి, వారికి ఓ వారసుడిని సృష్టించి ఆ ఇంటి వేరే వాళ్లకు అమ్మారని తెలిసి షాక్ కు గురయ్యారు.
శ్రీరామ్, కాంతమ్మ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్లు..
ఓబులదేవరచెరువు మండలానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుటుంబం కదిరిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు నకిలీ పత్రాల్లో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ లో శ్రీరామ్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంతమ్మ మృతి చెందారంటూ పత్రాలు సృష్టించారు. ఈ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు కదిరి మున్సిపల్ కమిషనర్ పేరిట మంజూరు అయ్యాయి. శ్రీరామ్ నాయక్ దంపతులకు కార్తిక్, పవన్ అనే ఇద్దరు కొడుకులు ఉండగా... ధర్మవరంలో అనిల్ అనే 20 ఏళ్ల యువకుడిని వారసుడిగా చూపిస్తూ మరో పత్రం సిద్ధం చేశారు. అనిల్ వారి కుమారుడేనని ధ్రువీకరిస్తూ తహసీల్దార్ తో సంబంధం లేకుండా ధర్మవరం వీఆర్వోనే వంశవృక్షం పత్రాన్ని జారీ చేశారు.
నకిలీ కుమారుడితో ఆస్తి అమ్మకం..
ఈ నకిలీ పత్రాలను పరిగణలోకి తీసుకొని అనంతపురంలోని ఆస్తిని ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. కోటిన్నర విలువ చేసే ఇంటిని కప్పల ముత్యాలమ్మ అనే మహిళకు నకిలీ కుమారుడు అనిల్ విక్రయించినట్లు గత నెల 23వ తేదీన ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఇచ్చేశారు. కదిరి మున్సిపాలిటీ, ధర్మవరం రెవెన్యూస రిజిస్ట్రేషన్ శాఖల అవినీతితో తాము రోడ్డున పడాల్సి వచ్చిందని అసలు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.