SIT Helpline Number For Prajwal Revanna Victims: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై (Prajwal Revanna) లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిపై విచారణ ముమ్మరం చేసింది. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం సిట్ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. బాధితులు 63609 38947 నెంబరుకు ఫోన్ చేస్తే వారికి రక్షణ కల్పిస్తామని తెలిపింది. బాధితులు ఎవరూ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని.. తామే వ్యక్తిగతంగా వారిని కలుస్తామని సిట్ అధిపతి బీకే  సింగ్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్ డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పనిమనిషి కిడ్నాప్ కేసులో.. బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ జాడ ఇంకా తెలియరాలేదు. ఆయన విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిట్ ఆయనకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ధ్రువీకరించారు. ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిట్ కు సహకరిస్తుందని.. పారదర్శకంగానే విచారణ జరుగుతుందని.. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.


మరోవైపు, ఈ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తమ పేర్లు ప్రస్తావించకూడదని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి కోర్టును ఆశ్రయించారు. వీరి వినతి మేరకు సంబంధిత వ్యవహారాల్లో వారి పేర్లు వాడకుండా న్యాయస్థానం స్టే విధించింది. అటు, సిట్ అధికారుల అదుపులో ఉన్న హెచ్ డీ రేవణ్ణ సోమవారం విచారణ సందర్భంగా ప్రశ్నలన్నింటికీ 'ఏమీ తెలియదు' అనే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని రేవణ్ణ నివాసంలో బాధిత మహిళలను సైతం విచారించారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని రేవణ్ణ భార్య భవానీకి కూడా నోటీసులు ఇచ్చారు.


రేవణ్ణ ఇంట్లో తనిఖీలు


మరోవైపు, బెంగుళూరులోని బసవనగుడిలో ఉన్న రేవణ్ణ ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సోదాల సమయంలో తనను ఇంట్లోకి అనుమతించకపోవడంపై రేవణ్ణ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ తనిఖీలు ఏకపక్షంగా సాగాయని విమర్శించారు. అటు, ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలకు సంబంధించిన ఈ వీడియోలు మార్ఫింగ్ వీడియోలని ఆయన తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కావాలనే కుట్రతో ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


Also Read: ED Raids: మంత్రి సెక్రటరీ ఇంట్లో కుప్పలుగా నోట్ల కట్టలు, గది నిండా పరిచి ఉన్న కరెన్సీ