Punjabi Singer Dead: ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్‌పూర్ గ్రామంలో ఆయనను దుండగులు కాల్చి చంపారని ABP న్యూస్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లోని మాన్సా జిల్లాలో ఆయన జీపులో వెళ్తున్నప్పుడు దుండగులు కాల్పులు జరిపారు. ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మాన్సా నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ పోటీ చేశారు. ఆప్‌కి చెందిన డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఆయన ఓడిపోయారు. సిద్ధూ మూసేవాలాతో సహా 424 మంది భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు శుక్రవారం ప్రకచించారు.






జి వ్యాగన్ తో కెరీర్ స్టార్ట్ పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామానికి చెందిన సిద్ధూ "జి వ్యాగన్" అనే సాంగ్ తో తన కెరీర్ ప్రారంభించాడు. 2018లో అతను తన తొలి ఆల్బమ్ PBX 1ని విడుదల చేశాడు. ఇది బిల్‌బోర్డ్ కెనడియన్ ఆల్బమ్‌ల చార్ట్‌లో 66వ స్థానానికి చేరుకుంది. అలాగే అతని సింగిల్ "47" UK సింగిల్స్ చార్ట్‌లో స్థానం పొందింది. 2020లో సిద్ధూను ది గార్డియన్ టాప్ 50 న్యూ ఆర్టిస్టులలో ఒకరిగా పేర్కొంది.






అంతర్జాతీయంగా పాపులర్ 


సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు ఇలా హింసను ప్రేరేపించే వాటిని ఎక్కువగా తన పాటల్లో చూపించి వివాదాస్పద గాయకుడిగా ఆయన వార్తలో నిలిచేవారు. ఆయన పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయింది. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌ వంటి చిత్రాల్లో సిద్ధూ నటించారు. 2020 జులై కొవిడ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై పోలీస్ కేసు నమోదు అయింది.  సిద్ధూ హత్యపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య పార్టీకి, యావత్‌ దేశానికి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.