Karnataka: కర్ణాటక శివమొగ్గలో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడు 24 ఏళ్ల హర్షగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించినట్లు శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ డా.సెల్వమణి తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. స్థానిక పోలీసులు, ఆర్‌ఏఎఫ్‌ను ప్రాంతంలో మోహరించాం. సెక్షన్ 144 విధించాం. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. - డా. సెల్వమణి, డిప్యూటీ కమిషనర్
సీఎం స్పందన
హర్ష హత్యపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు.
ఎవరు చేశారు?
ఈ హత్యపై కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర స్పందించారు. ఈ ఘటనలో ఏదైనా సంస్థ హస్తం ఉందా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నలుగురు, ఐదుగురు సభ్యుల బృందం ఈ హత్య చేసింది. ఈ హత్య వెనుక ఏదైనా సంస్థ హస్తం ఉందా అనేది ఇంకా తెలియదు. శివమొగ్గ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. కానీ ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ఇచ్చాం. - జ్ఞానేంద్ర, కర్ణాటక హోంమంత్రి
ఆగ్రహం
ఈ విషయం తెలిసిన వెంటనేే నిన్న రాత్రి కొంతమంది ఆ ప్రాంతంలోని వాహనాలకు నిప్పుపెట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రంలో హిజాబ్ వివాదం నడుస్తుండటంతో దానికి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.