విజయవాడ: బెజవాడలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శుక్రవారం రాత్రి డీ అడ్రస్ మాల్ వద్ద కొందరు గుర్తుతెలియని దండగులు శ్రీనివాస్‌ను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. డీ అడ్రస్ మాల్ ఓనర్ సైతం విజయవాడ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శ్రీనివాస్ కిడ్నాప్ పై ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే శ్రీనివాస్ గాంధీనగర్ కి చెందిన వ్యక్తి కావిడంతో అనంతరం కృష్ణలంక పోలీసులు  సత్యనారాయణపురం పోలీసులకు కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు.