Severe Tragedy Incidents In Telangana: తెలంగాణలో దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని తండ్రీ కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. మరోచోట, పిడుగు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు, జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బంగారం కోసం సొంత అమ్మమ్మనే కడతేర్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలు దాటుతోన్న క్రమంలో తండ్రీ కుమార్తెలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) మధిరలో (Madhira) చోటు చేసుకుంది. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52), అతని కూతురు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28)తో కలిసి విజయవాడలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి మధిర చేరుకున్నారు. వీరు విజయవాడ నుంచి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలుస్తోంది.
ట్రైన్ దిగి వెళ్తుండగా..
వీరు ట్రైన్ దిగి రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా.. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తోన్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిత పదేళ్ల కుమారుడు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు, దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాజాసాయిగా గుర్తించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగు పడి..
అటు, గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్మాల్ మండలం ధనూర గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన డాకూరు శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు భరత్, చరణ్. శ్రీశైలం తనకున్న గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి.. ఆ తర్వాత కుమారుడు భరత్‌ను గొర్రెల వద్ద ఉంచి తాను ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు భరత్‌ను బలి తీసుకుంది. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అదే గ్రామానికి చెందిన బేతయ్య (42) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం చేయగా.. కుమారుడు హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బేతయ్య గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న భార్య విలపించింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బంగారం కోసం అమ్మమ్మను..
అటు, చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు బంగారం కోసం అమ్మమ్మను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం ఖానాపూర్ (బీ) గ్రామంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసైన మహేష్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, ఆమె మెడలోని బంగారం కోసం అమ్మమ్మ దుర్గమ్మ (60)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బంగారం తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?