Severe Accident In Anantapuram: మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంట పెళ్లి జరగనుంది. ఇంతలోనే విధి వక్రించింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసి వస్తుండగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం (Anantapuram) జిల్లా గుత్తి (Gooty) సమీపంలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని రాణినగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంత జిల్లాకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో ఓ దాబా వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. అదే సమయంలో అనంత నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ, ఈ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులు అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40)గా గుర్తించారు. కాగా, ఈ నెల 27న షేక్ సురోజ్ బాషా వివాహం జరగనుండగా.. పెళ్లి బట్టలు తీసుకునేందుకు వీరు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Andhra News : పోలింగ్ అనంతర హింసపై కఠిన చర్యలు - సిట్ ఏర్పాటు