Kumbh Mela Fire Accident In Prayagraj: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayag Raj) జరుగుతున్న మహా కుంభమేళాలో (Maha Kumbhmela) ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 19లోని భక్తుల శిబిరంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మంటలు వ్యాపించి మొత్తం 30 టెంట్లు దగ్ధమయ్యాయని వెల్లడించారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అటు, ఘటనా స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
'మహా కుంభమేళాలో సెక్టార్ 19 వద్ద గుడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు సైతం వ్యాపించాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.' అని పోలీసులు తెలిపారు.
గీతాప్రెస్‌కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని.. నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతుందని చెప్పారు. ప్రమాదంలో టెంట్లు, కొన్ని వస్తువులు మాత్రమే దగ్ధమయ్యాయని.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిర్వాహకుల తీవ్ర విచారం
మరోవైపు, ఈ ప్రమాదంపై మహా కుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి